ఐసెట్, డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల | AP DEECET and AP ISET Results Released | Sakshi
Sakshi News home page

ఐసెట్, డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల

Published Fri, May 31 2024 5:09 AM | Last Updated on Fri, May 31 2024 5:09 AM

AP DEECET and AP ISET Results Released

3,191 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత 

జూన్‌ 6 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

20వ తేదీ నుంచి తరగతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్‌–2024 (డైట్‌ సెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. సెట్‌ కన్వీనర్, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మేరి చంద్రిక గురువారం విజయవాడలోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 24న డైట్‌ సెట్‌ నిర్వహించగా.. ఆరు రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు.

ఈ పరీక్షకు 4,949 మంది అభ్యర్థులు హాజరవ్వగా,  3,191 మంది ఉత్తీర్ణులయ్యారు. మ్యాథమెటిక్స్‌ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన బులుసు గ్రీష్మిత, ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేసన మీనాక్షి, బయోలాజికల్‌ సైన్స్‌ విభాగంలో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన షేక్‌ రుక్సానా, సాంఘిక శాస్త్ర విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తా సునీల్‌కుమార్‌ మొదటి ర్యాంకులు సాధించి స్టేట్‌ టాపర్స్‌గా నిలిచారు.

6 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ 
ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధనకు ఉద్దేశించిన రెండేళ్ల డీఈఈ కోర్సుకు ఎంతో డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో 14 ప్రభుత్వ డైట్‌ కాలేజీలు ఉండగా వాటిలో 1,650 సీట్లు ఉన్నాయి. మరో 15 ప్రైవేటు డైట్‌ కాలేజీల్లో 1,500 సీట్లు కలిపి మొత్తంగా 3,150 సీట్లున్నాయి. డైట్‌ సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్‌ 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించినట్టు కన్వీనర్‌ మేరీ చంద్రిక తెలిపారు. జూన్‌ 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు.

ఏపీ ఐసెట్‌లో 96.70 శాతం మంది ఉత్తీర్ణత
అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్‌–2024 ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఐసెట్‌ ఫలితాలను ఎస్కేయూలోని వీసీ కాన్ఫరెన్స్‌ హాలులో విడుదల చేశారు. ఏపీఐసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హుస్సేన్‌రెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.మురళీకృష్ణ, ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్య, ఐసెట్‌ కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌ సి.శోభాబిందు, ప్రొఫెసర్‌ కె.రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 48,828మంది ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 44,447 మంది పరీక్షకు హాజరుకాగా, 42,984 మంది (96.70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 23,315మంది దరఖాస్తు చేసుకోగా, 21,033 మంది హాజరయ్యారు. వీరిలో 20,296 (97 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 25,513 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23,414 మంది పరీక్షకు హాజరుకాగా, 22,688 మంది (97.48 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

పురుషుల కంటే మహిళల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. తుది ‘కీ’లో కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే 5 రకాల జవాబులు రావడంతో ఆ రెండు ప్రశ్నలు రాసినవారికి మార్కులు అదనంగా కలిపారు. 34 మంది అభ్యర్థులు స్క్రైబ్‌ సాయంతో పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు జూన్‌ 5, 6 తేదీల్లో విడుదల చేస్తామని తెలిపారు.

ఏపీ ఐసెట్‌లో టాప్‌ –10 ర్యాంకర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement