బీజేపీని ఓడించడమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

బీజేపీని ఓడించడమే లక్ష్యం

Published Tue, May 7 2024 4:55 AM

బీజేపీని ఓడించడమే లక్ష్యం

కరీంనగర్‌: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా సీపీఐ ముఖ్య నాయకులతో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ మర్రి వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. అబద్ధాలకోరు నరేంద్రమోదీ అని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సూచించారు. ప్రధాని మోదీ తనకు కుటుంబమే లేదంటాడు కానీ ఆయనకు 29మంది దత్త పుత్రులు ఉన్నారని, వారంతా గుజరాత్‌ బ్యాంకుల్లో లక్షల కోట్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని విమర్శించారు. పదేళ్లల్లో ఇచ్చిన వాగ్దానాలను ఆటకెక్కించి, హమీలను అమలు చేయకుండా ఆయోధ్య పేరుతో రాముడి పేరుచెప్పి ఓట్లు దండుకునే కుట్రను ప్రజలు గ్రహించారని ధ్వజమెత్తారు. ప్రధానిగా ఉంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేస్తామనడం ప్రజాస్వామ్య ప్రక్రియకే విఘాతమని అన్నారు. గంజాయి స్మగ్లరైన అదానీ నేడు కోట్లకు ఎలా అధిపతి అయ్యాడని విమర్శించారు. నరేంద్ర మోదీకి వివాహవ్యవస్థపై గౌరవం లేదని, తాళి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడని ప్రశ్నించారు. కరీంనగర్‌ అభివృద్ధికి కృషి చేయలేని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ని ఓడించి సీపీఐ బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చురుగ్గా వ్యవహరించిన బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఎందుకు ఆ పదవి నుంచి దించిందో అందరికీ తెలుసన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్‌, కర్రె భిక్షపతి, గుంటి వేణు, వెన్న సురేశ్‌, తాండ్ర సదానందం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పొనగంటి కేదారి, గడిపే మల్లేశ్‌, ఆదరి శ్రీనివాస్‌, కసిరెడ్డి మణికంఠరెడ్డి పాల్గొన్నారు.

ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు

ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించండి

సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

Advertisement
 
Advertisement
 
Advertisement