‘మహా’ ఓటింగ్‌ శాతం తక్కువే | Sakshi
Sakshi News home page

‘మహా’ ఓటింగ్‌ శాతం తక్కువే

Published Sat, Apr 20 2024 1:50 AM

భోలాపటార్‌లో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న సరిహద్దు గ్రామాల ఓటర్లు - Sakshi

● ఓటేయని చాలామంది ‘సరిహద్దు’ ఓటర్లు ● తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకే ఆసక్తి

కెరమెరి(ఆసిఫాబాద్‌): మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు శుక్రవారం మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 15 గ్రామాల ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల తర్వాత కాస్త పెరిగింది. ప్రధానంగా మూడు పోలింగ్‌ బూత్‌ల పరిధిలో అత్యధిక గ్రామాలున్నాయి. పరఽందోళి పోలింగ్‌ కేంద్రంలో 1,216 మంది ఓటర్లుండగా 646 మంది ఓటు వినియోగించుకున్నారు. భోలాపటార్‌లో 848 మందికి 523, అంతాపూర్‌లో 470 మందికి 103 మంది, మహరాజ్‌గూడలో 328 మందికి 218 మంది ఓటు వేశారు.

ఫలితమిచ్చిన అవగాహన

ఒక ఓటరు ఒకసారి, ఒకే వైపు ఓటు చేయాలని ఇటీవల రెవెన్యూ అధికారులు సరిహద్దు గ్రామాల్లో క ల్పించిన అవగాహన ఫలితమిచ్చింది. దీంతో ఆ యా బూత్‌లలో 60 శాతానికి మించి ఓటింగ్‌ దాట లేదు. ముఖ్యంగా అంతాపూర్‌ పోలింగ్‌ బూత్‌లో 470 మంది ఓటర్లకు 103 మంది మాత్రమే ఓటేసినట్లు తెలిసింది. అనేకులు మే 13న తెలంగాణలో జరిగే ఎంపీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇష్టపడి మహా రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు వేయలేదని సమాచారం.

ఇక్కడి అభివృద్ధికి మెచ్చి..

ఎన్నో ఏళ్లుగా సరిహద్దులోని 15 గ్రామాల ప్రజలు రెండు ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు. అనేక గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తక్కువేనని ఇక్కడి ఓటర్లు చెబుతున్నారు. తెలంగాణలో వసతుల కల్పన, అభివృద్ధి, సంక్షేమం బాగున్నట్లు భావించిన ఓటర్లు ఇక్కడే ఓటేయాలని నిర్ణయించుకుని ‘మహా’ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కాగా, చంద్రాపూర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన అనేకులు వేలుకు పెట్టిన సిరా చుక్కను నిమ్మకాయతో చెరిపేసిన ఘటనలు కనిపించాయి. గతంలోనూ ఇలాగే చేసి రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వీరు ఓటేయడం గమనార్హం.

Advertisement
Advertisement