మైనంపల్లి రోహిత్ మాటలకు అర్థాలే వేరులే..! | Sakshi
Sakshi News home page

మైనంపల్లి రోహిత్ మాటలకు అర్థాలే వేరులే..!

Published Sat, Nov 18 2023 6:40 AM

- - Sakshi

మెదక్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు 48 గంటల కరెంటు ఇస్తాననడంతో ఇదేం చోద్యం రోజుకు 24 గంటలే కదా ఉన్నది.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. అలాగే, మెదక్‌ నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేకుండా ఆయన మాట్లాడుతుండడంతో సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.

గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తక్షణం నియోజకవర్గ ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, రోహిత్‌రావు ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని పలువురు వాపోతున్నారు. ప్రచారంలోనూ ప్రజలపై మండిపడుతూ నేను చెప్పిందే వినాలని అనే విధంగా అసహనం వ్యక్తం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎమ్మెల్యేగా ఎన్నికై తే ఇంకెలా మాట్లాడుతారో అని ప్రజలు విమర్శిస్తున్నారు.

జింకలు తరలించారంటూ గగ్గోలు
హవేళిఘణాపూర్‌ మండలం పోచారం అభయారణ్యంలో 120 ఎకరాల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం విస్తరించి ఉంది. ఇందులో జింకల సంఖ్య ఒక పరిమితి వరకు మాత్రమే ఉంచుతారు. ఆ పరిమితి దాటితే వాటిని ఇక్కడి నుంచి వివిధ అటవీ ప్రాంతాలకు తరలిస్తారు. ఒకవేళ తరలించకుంటే వాటి సంఖ్య పెరిగి ఆహారం దొరక్క చనిపోతాయి. ఇటీవల ఈ ప్రత్యుత్పత్తి కేంద్రం నుంచి కొన్ని సిద్దిపేట జిల్లాలోని ఆక్సిజన్‌ పార్కుకు తరలించినట్లు తెల్సింది.

దీనిపై రోహిత్‌రావు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు జింకలను సైతం వదలకుండా ఇక్కడి నుంచి తరలించాడంటూ వ్యాఖ్యలు చేశాడు. పార్కులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఏంటని, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంపై ఎలా పట్టు సాధిస్తాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

Advertisement
Advertisement