Sakshi News home page

Citadel Series: 'సిటాడెల్' దెబ్బ.. ఆ ఓటీటీ‌కి మాములుగా తగల్లేదు!

Published Fri, Jul 7 2023 2:34 PM

Citadel Web Series Amazon Prime 2000 Crore Loss - Sakshi

సినిమా చూడాలంటే ఒకప్పుడు థియేటర్ లోనే... ఏదేమైనా ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓటీటీ సంస్థలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో స్టార్స్‌ని తీసుకొచ్చి భారీ బడ్జెట్స్ పెడుతున్నాయి. వందల కోట్ల లాభాలు దక్కించుకోవాలని చూస్తున్నాయి. కట్ చేస్తే ఘోరమైన నష్టాలు చూస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్‌ అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటోంది. స్వయంగా ఆ సంస్థ సీఈఓ ఈ విషయాన్ని బయటపెట్టారు. 

'సిటాడెల్' ఫ్లాప్
ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఖరీదైన వెబ్ సిరీసుల్లో 'సిటాడెల్' ఒకటి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మన దేశంలోనూ రిలీజైంది. చాలామందికి నచ్చే యాక్షన్ తరహా స్టోరీతోనే తీశారు. కానీ పెద్దగా ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఈ సిరీస్ కోసం దాదాపు 250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.2000 కోట్లు. ఇప్పుడు అదంతా వృథా అయినట్లే! ఈ సిరీస్ మీద ప్రైమ్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అవన్నీ కూడా గంగలో కలిసిపోయినట్లే.

(ఇదీ చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల)

సమంత కూడా
ప్రియాంక చోప్రాతో తీసిన 'సిటాడెల్'.. ఇండియన్ వెర్షన్‌ని హీరోయిన్ సమంతతో తీశారు. 'ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. సమంతతో పాటు వరుణ్ ధావన్ లీడ్ రోల్ చేశాడు. దీని షూటింగ్ పూర‍్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఒరిజినల్ సిరీస్ మన దగ్గర ఆడలేదు. సమంత 'సిటాడెల్' హిట్ అయితే అమెజాన్‌కు కొంతైనా లాభాలు వస్తాయి. లేదంటే కష్టమే!

ఉద్యోగులకు మూడింది
'సిటాడెల్' సిరీస్‌తో పాటు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన డైసీ జోన్స్ అండ్ ది సిక్స్, ది పవర్, డెడ్ రింగర్స్, ది ఫెరిఫెరల్ లాంటి షోలు కూడా ఫెయిలయ్యాయి. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కోసమైతే ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. కానీ అది కూడా నిరాశపరిచింది. ఈ పరిణామాలన్నీ సీరియస్ గా తీసుకున్న అమెజాన్.. ఇలా ఫెయిలైన సిరీస్‌లను కొనసాగించడం ఆపాలని నిర్ణయించుకుంది. దీనికి బాధ్యులైన ఉద్యోగులని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒక్కసారి దెబ‍్బ తగిలితే గానీ నొప్పి తెలిసి రాదు!

(ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి)

Advertisement

What’s your opinion

Advertisement