
వెదుళ్లపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టైరు పేలి కంటైనర్ లారీని ఢీకొన్న కారు
ముగ్గురు దుర్మరణం, ఒకరికి గాయాలు
మృతులు విశాఖ నగరవాసులు
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్‌ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.
పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా....
వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
గవరవీధిలో విషాదఛాయలు
గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్‌ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్‌గేట్ వద్ద కారు ఎక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment