అమ్మా నాన్నలకు టాటా చెబుతూ.. నగుమోముతో బడికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగత జీవులై తిరిగి వచ్చారు. మృత్యుపాశాలతో రోడ్లపై తిరిగే వాహనాలు వారిని బలిగొన్నాయి. జి.మాడుగుల మండలంలో పదో తరగతి చదువుతున్న బాలిక తండ్రి బండిపై ఇంటికి తిరిగి వస్తుండగా బొలెరో ఢీకొని మృతి చెందింది. పెందుర్తిలో మరో బాలిక పాఠశాల విరామ సమయంలో రోడ్డుపైకి వెళ్లి లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయింది.
జి.మాడుగుల: పాఠశాల విడిచి పెట్టాక తండ్రి బండిపై ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం పాలైంది. ఆమె తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషాద సంఘటన జి.మాడుగులలో ఆస్పత్రి (పీహెచ్‌సీ) జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. జి.మాడుగుల పంచాయతీ నేరోడివలస గ్రామానికి చెందిన కిముడు నూకరాజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కూతురు వర్షిణి (15), ఆరో తరగతి చదువుతున్న కొడుకు ప్రశాంత్‌లను తన మోటార్ బైక్‌పై ఇంటికి తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
వారపు సంత ముగించుకొని నిత్యవసర దుకాణదార్లను నర్సీపట్నం వైపు తీసుకువెళుతున్న బొలెరో పికప్ వాహనం ఆస్పత్రి జంక్షన్ వద్ద బైక్‌ను ఢీకొంది. వర్షిణి తీవ్రంగా గాయపడటంతో పీహెచ్‌సీకు తరలించగా అక్కడ మృతి చెందింది. ప్రశాంత్‌కు కుడిచేయి విరిగిపోయింది. నూకరాజు సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బందితో ఎస్‌ఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసి బొలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చలాకీగా.. చదువులో చురుగ్గా..
ఈ ప్రమాదంలో మృతి చెందిన వర్షిణి చలాకీగా.. చదువులో చురుగ్గా ఉండేది. తమ కుమార్తెను మంచి ప్రయోజకురాలిని చేద్దామని తల్లిదండ్రులు కలలు కన్నారు. తండ్రి నూకరాజుది పేద కుటుంబం. వ్యవసాయం, కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జి.మాడుగులలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాడు. అతనికి వర్షిణి, ప్రశాంత్ కాకుండా మరో కుమార్తె ఉంది. పదో తరగతికి చేరుకున్న తమ ముద్దుల పట్టి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళుతుందనుకుంటే.. తమ చేతులతోనే కాటికి పంపాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి తరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment