‘మార్కెట్‌ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Market Mahalakshmi Review: కూరగాయలు అమ్ముకునే అమ్మాయితో సాఫ్ట్‌వేర్ అబ్బాయి ప్రేమలో పడితే?

Published Thu, Apr 18 2024 6:33 PM

Market Mahalakshmi Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మార్కెట్‌ మహాలక్ష్మి
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
నిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ 
నిర్మాత: అఖిలేష్ కలారు
దర్శకత్వం: వియస్ ముఖేష్
సంగీతం: జో ఎన్మవ్  
నేపథ్య సంగీతం: సృజన శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
విడుదల తేది: ఏప్రిల్‌ 19, 2024

‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్‌ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్‌ శంకర్‌) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్‌ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్‌ చేసి, మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్‌ ‘మార్కెట్‌ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్‌ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..?
పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్‌కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.

పెరెంట్స్‌కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్‌  అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. 

కథలోని ఎమోషన్‌ని ప్రేక్షకుడు ఫీల్‌ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్‌ అయ్యారు. హీరో.. హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడే సీన్‌తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్‌ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. 

ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్‌ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్‌ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్‌లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి.  ఇంటర్వెల్‌ సీన్‌ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌ కథంతా మార్కెట్‌ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్‌ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్‌గా బతకాలని అనుకోవాడానికి గల కారణం  కన్విన్సింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌  బాగుటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా  ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్‌ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్‌గా ముక్కు అవినాష్‌ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ బ్రదర్‌, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్‌ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్‌ శంకర్‌, జయ, పద్మ, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్‌ స్కోర్‌, జో ఎన్మవ్‌ మ్యూజీక్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

Rating:
Advertisement

తప్పక చదవండి

Advertisement