ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్ | Tollywood Hero Allari Naresh Comments On Latest Movie | Sakshi
Sakshi News home page

Allari Naresh: ఆ స్టార్‌ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్

Published Wed, May 1 2024 9:34 PM | Last Updated on Thu, May 2 2024 1:53 PM

Tollywood Hero Allari Naresh Comments On Latest Movie

 అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేశ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అల్లరి నరేశ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మళ్లీ కామెడీ వైపు మళ్లడంపై ఆయన స్పందించారు.  

నరేశ్ మాట్లాడుతూ..'అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే ఉన్నా. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించా. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ ఉంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి ఇలాంటి కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు. పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా ఉంటుంది' అన్నారు. 
 

చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడంపై మాట్లాడుతూ..' కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. మళ్లీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. కామెడీకి ఆదరణ ఇంకా పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుడిగాడు- 2 కోసం అడుగుతున్నారు. మనం అన్ని రకాల సినిమాలు చేయాలి.  ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే 'పుష్పక విమానం' లాంటి సినిమా చేయాలని ఉంది. వెంకటేశ్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేమిద్దరం కామెడీ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఉంది' అని తెలిపారు. కాగా.. ఆ ఒక్కటీ అడక్కు మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement