Ustaad Bhagat Singh: సినిమాల్లోనూ పవన్‌ ప్యాకేజీ పాలిటిక్స్‌! | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh: రాజకీయం కోసం సినిమానా?.. ‘గ్లాస్‌’ డైలాగ్స్‌పై సెటైర్స్‌

Published Tue, Mar 19 2024 7:26 PM

Netizens Trolls On Pawan Kalyan Ustaad Bhagat Singh Glimpse - Sakshi

సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.. సినిమాల విషయంలో పవన్‌ కల్యాణ్‌  చేస్తున్న హైడ్రామా చూస్తుంటే, ఆ మాట ఆయనకి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. రాజకీయం కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను వాడుతూ చివరికి రెండిటికి చెడ్డ రేవడిలా మారాడు ఈ నట నాయకుడు. ఒకప్పుడు పవన్‌ కల్యాణ్‌ నుంచి సినిమా అంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉండేవి. సినిమా అప్‌డేట్స్‌ వస్తే చాలు మెగా ఫ్యాన్స్‌ చేసే హడావుడి మాములుగా ఉండేది కాదు.

కానీ ఈ మధ్యకాలంలో ఓ చిన్న హీరో సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ కూడా పవన్‌ మూవీకి రావడం లేదు. దానికి కారణం సినిమాను సినిమాగా తీయకుండా.. తన రాజకీయాల కోసం వాడుకోవడమే. ప్రతి సినిమాలోనూ తన పార్టీ ప్రచారం కోసం అనవసరపు సన్నివేశాలనో.. డైలాగ్స్‌నో చొప్పించి, ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఆ మధ్య ‘బ్రో’ సినిమాలోనూ  ప్యాకేజీ పాలిటిక్స్‌ చేసి, చివరకు నిర్మాతలకు కోట్లల్లో నష్టం వచ్చేలా చేసి సైడ్‌ అయిపోయాడు.

ఇక తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాల్లోనూ తన ప్యాకేజీ పాలిటిక్స్‌ని అప్లై చేశాడు. తన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌పై డైలాగ్స్‌ చెప్పించి.. సినిమాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్‌. అందులో పవన్‌ జస్ట్‌ యాక్టర్‌ మాత్రమే. అంటే రెమ్యునరేషన్‌ తీసుకొని నటించి వెళ్లాలి. కానీ ఒకవైపు భారీగా పారితోషికం పుచ్చుకుంటునే.. మరోవైపు ఆ సినిమానే తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నాడు. అలా తనకొచ్చిన ప్రతి సినిమానూ రాజకీయంగా వాడుకుంటూ.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. దీని వల్ల నిర్మాతలు రూ. కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. ఒకవేళ సినిమాలను రాజకీయాల కోసం వాడుకోవాలంటే.. తనే నిర్మాతగా మారి సినిమా చేస్తే బాగుంటుంది కానీ.. మరొకరి సొమ్ముతో ఈయన రాజకీయ ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. 


పార్ట్‌టైం పాలిటిక్స్‌కి ఫిక్స్‌!
ఇది ఎన్నికల సమయం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కానీ ప్యాకేజీ స్టార్‌ మాత్రం ఇప్పుడు కూడా తన సమయాన్ని సినిమాలకే కెటాయిస్తున్నాడంటే.. ఎన్నికల తర్వాత తన దారి ఎటో తెలిసిపోతుంది. ఎన్నికలు అయిపోగానే పాలిటిక్స్‌కి ప్యాకప్‌ చెప్పి..ముఖానికి మేకప్‌ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకొనే.. వరుస సినిమాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వపన్‌ చేతిలో హరిహరవీరమల్లు , ఓజీ  , ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో పవన్‌ ఫుల్‌టైమ్‌ని సినిమాలకే కేటాయించాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. 

‘గ్లాస్‌’డైలాగ్స్‌పై సెటైర్స్‌
తాజాగా రిలీజైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌  గ్లింప్స్‌పై నెటిజన్స్‌ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాపై ఇప్పటి వరకు భారీ అంచనాలు ఉండేవనీ..కానీ గ్లింప్స్‌ చూశాక పవన్‌ ఈ సారి కూడా తన స్వార్థం కోసం సినిమాను చెడగొట్టాడని నెటిజన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ కూడా గ్లింప్స్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను అడ్డుపెట్టుకొని సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం అవసరమా అని పవర్‌ స్టార్‌ ఫ్యాన్సే చర్చించుకుంటున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్‌ అయితే.. సినిమాలోని ‘గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం’ డైలాగ్స్‌పై సెటైరికల్‌ కామెంట్‌ చేస్తున్నారు.  ‘అసలు సినిమాకు గాజు గ్లాసుకు సంబంధం ఏంటి?’, ‘ఇదేదో జనసేన పొలిటికల్‌ యాడ్‌లా ఉందే’‘ఈసారి పిఠాపురం(పవన్‌ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం)లో గ్లాస్‌ నుజ్జు నుజ్జు అయిపోతుందటగా’, ‘ఫ్యాన్‌ గాలికి గ్లాస్‌ పగిలిపోవడం ఖాయం’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement