అటవీ సంరక్షణ కోసమే నిబంధనలు | Sakshi
Sakshi News home page

అటవీ సంరక్షణ కోసమే నిబంధనలు

Published Wed, Apr 17 2024 1:30 AM

మాట్లాడుతున్న డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి  - Sakshi

మన్ననూర్‌: అటవీ, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని సలేశ్వరం జాతరలో అటవీ శాఖ నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మన్ననూర్‌లోని ఈసీ సెంటర్‌లో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల ఆరాధ్య క్షేత్రాలు 25 వరకు ఉన్నాయని.. చెంచుల ఆచార వ్యవహారాల ప్రకారం జాతరలు నిర్వహించుకునేందుకు అటవీ శాఖ ఎంత మాత్రం ఆటంకం కలిగించదన్నారు. భక్తులు దేవుడిని చూడవద్దని అనడం లేదని.. క్రమశిక్షణ పాటిస్తూ పద్ధతిగా ఉండాలన్నదే అటవీశాఖ ఉద్దేశమని అన్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకం, చుట్ట, బీడీ, సిగరేట్‌ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం ఉత్సవాలకు దూరంగా ఉండాలని కోరారు. భక్తులకు అన్నివిధాలా సహకరించేందుకు అటవీశాఖ తరఫున 200 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు మరో 100 మంది వలంటీర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేట డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

చెంచులకు రుణాలు..

సలేశ్వరం జాతరలో దుకాణాల ఏర్పాటు కోసం అప్పాపూర్‌, రాంపూర్‌ తదితర పెంటల్లోని చెంచులకు ఐటీడీఏ తరఫున రూ. 20వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి తెలిపారు. జాతరలో కొబ్బరికాయలు, పూజా సామగ్రిని చెంచులు మాత్రమే విక్రయించేవిధంగా అనుమతులు ఇవ్వడంతో పాటు రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్‌, శ్వేత తదితరులు ఉన్నారు.

డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి

సలేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక ప్యాకేజీ..

పర్యాటకులు, భక్తులు ఏడాదిలో 9 నెలల పాటు సలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకునేందుకు అటవీ శాఖ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. ప్రత్యేక వాహనంలో 100 మంది చొప్పున టూర్‌ ఏర్పాటుచేసి, అటవీ పరిసర ప్రాంతాలతో పాటు సహజ ప్రకృతి ప్రదేశాలు, వన్యప్రాణులను వీక్షించేందుకు మే మొదటి వారం నుంచి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో భక్తులు పెద్ద ఎత్తున సలేశ్వరం ఉత్సవాలకు తరలివచ్చి, ఇబ్బందులు పడవద్దని తెలిపారు.

Advertisement
Advertisement