జూన్‌ 1న కళాశాలలు పునఃప్రారంభం | Sakshi
Sakshi News home page

జూన్‌ 1న కళాశాలలు పునఃప్రారంభం

Published Fri, Apr 19 2024 1:05 AM

నంద్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 
 - Sakshi

నంద్యాల(న్యూటౌన్‌): జూనియర్‌ కళాశాలలు జూన్‌ 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు సైతం మొదలుకానున్నాయి. ఈ మేరకు తాజాగా ఇంటర్మీడియెట్‌ బోర్డు 2024–25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్‌, షెడ్యూల్‌ విడుదల చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కళాశాలలు 222 రోజులు పనిచేయనున్నాయి. 2025 మార్చి 31 ఆఖరి పనిదినంగా, ఏప్రిల్‌ 1 నుంచి 2025 జూన్‌ ఒకటి వరకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా సాంస్కృతిక వారోత్సవాలను అక్టోబర్‌ ఆఖరివారంలో నిర్వహించాలని, స్పోర్ట్స్‌ వారోత్సవాలను నవంబర్‌ ఆఖరివారంలో నిర్వహించాలని, అలాగే సైన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ను 2025 జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించాలని క్యాలెండర్‌లో పేర్కొన్నారు. 2020 మార్చిలో విజృంభించిన కరోనా వైరస్‌ (కోవిడ్‌)తో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ ప్రభుత్వ పకడ్బందీ చర్యలతో రెండేళ్ల నుంచి పూర్తిస్థాయిలో గాడిలో పడింది. ఈ ఏడాది 2024లో యథావిధిగా జూన్‌ 1వ తేదీన కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 139 జూనియర్‌ కళాశాలలు ఉండగా, ఇందులో 57 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం క్యాంపెయినింగ్‌ నిర్వహించారు. కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్‌ డ్రైవ్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు, ల్యాబ్‌లు, డిజిటల్‌ విద్య, ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ద్వారా బోధన, అధ్యాపకుల పనితీరు, బోధన విధానాలు, ఇంటర్‌ విద్యతో లభిస్తున్న భవిష్యత్‌ అవకాశాలను తెలియజేసి ఆకర్షితులను చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో గణనీయంగా అడ్మిషన్లు జరిపేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌ బోర్డు వార్షిక క్యాలెండర్‌ పక్కాగా అమలు చేస్తామని ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సెలవులు ప్రకటిం చడం జరుగుతుందన్నారు.

Advertisement
Advertisement