బీఎస్పీ గూటికి మందా | Sakshi
Sakshi News home page

బీఎస్పీ గూటికి మందా

Published Thu, Apr 18 2024 9:35 AM

బీఎస్పీ అధినేత్రి మాయవతితోమాజీ ఎంపీ మందా జగన్నాథం   - Sakshi

మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బరిలో నిలిచే అవకాశం

అలంపూర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్‌ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్‌ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్‌ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్‌లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు.

1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం..

మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 4వ సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.

బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్‌ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్‌ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా అలంపూర్‌కు చెందిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీని వీడి బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలవగా.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు.

Advertisement
Advertisement