Know what P.H. in railway station names stands for - Sakshi
Sakshi News home page

సిబ్బంది లేని రైల్వే స్టేషన్లు అవి.. టిక్కెట్లు ఎవరిస్తారంటే..

Published Sat, May 27 2023 10:32 AM

know what are passanger halt stations - Sakshi

మనం పలు రైల్వే స్టేషన్ల పేర్లు వినేవుంటాం. వాటిలో కొన్నింటి పేర్ల చివర సెంట్రల్‌, టెర్మినల్‌, రోడ్డు అని ఉండటాన్ని చూసేవుంటాం. అయితే కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర పీహెచ్‌ అని రాసివుంటుంది. అలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల చివరన పీహెచ్‌ అని ఉంటుంది. ఇక్కడ పీహెచ్‌ అంటే పాసింజర్‌ హాల్ట్‌ అని అ‍ర్థం. అంటే ఈ స్టేషన్లలో కేవలం పాసింజర్‌ రైళ్లు మాత్రమే ఆగుతాయి.

ఇటువంటి స్టేషన్లు మిగిలిన స్టేషన్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ స్టేషన్లలో  రైల్వేశాఖ తరపున ఎటువంటి అధికారిగానీ, ఉద్యోగిగానీ ఉండరు. పాసింజర్‌ హాల్ట్‌ అనేది డీక్లాస్‌ తరహా స్టేషన్‌. రైళ్లు ఆగేందుకు సిగ్నల్‌ చూపేలా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. అయితే సిగ్నల్స్‌ లేని ఇటువంటి స్టేషన్లలో రైళ్లు ఎలా ఆగుతాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి రైల్వే స్టేషన్లలో రైళ్లను రెండు నిముషాల పాటు ఆపాలంటూ ట్రైన్‌ డ్రైవర్‌కు ముందుగానే ఆదేశాలు అందుతాయి. ఈ మేరకు డ్రైవర్‌ ఆయా స్టేషన్లలో రైళ్లను ఆపుతాడు.

కాగా ఇటువంటి స్టేషన్లలో రైల్వే సిబ్బందే లేకపోతే మరి ప్రయాణికులు టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే సందేహం కలుగుతుంది. ఇటువంటి డీ క్లాస్‌ స్టేషన్లలో రైల్వేశాఖ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కమిషన్‌ ఆధారంగా టిక్కెట్లు విక్రయించేందుకు నియమిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటువంటి రైల్వేస్టేషన్లకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇటువంటి స్టేషన్ల నుంచి రైల్వేకు ఎటువంటి ఆదాయం రావడంలేదని సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement