ఖతర్ చేతిలో పరాజయం
మూడో రౌండ్‌కు చేరలేకపోయిన టీమిండియా
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
మూడో రౌండ్‌కు చేరాలంటే భారత జట్టు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సింది. కానీ భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కువైట్ జట్టు 1–0తో గెలిచింది. దాంతో గ్రూప్ ‘ఎ’ నుంచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఖతర్... 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన కువైట్ మూడో రౌండ్‌కు అర్హత సాధించాయి.
5 పాయింట్లతో భారత్, అఫ్గానిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ సగటుతో భారత్‌కు మూడో స్థానం, అఫ్గానిస్తాన్‌కు నాలుగో స్థానం లభించాయి.
రిఫరీ చెత్త నిర్ణయం...
ఖతర్‌తో మ్యాచ్‌లో భారత జట్టుకు 37వ నిమిషంలో లాలియన్‌జువాల్ చాంగ్టె గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 73 నిమిషాల వరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ దశలో రిఫరీ చెత్త నిర్ణయం కారణంగా ఖతర్ జట్టు ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. 73వ నిమిషంలో యూసుఫ్ ఐమన్ కొట్టిన హెడర్‌ను భారత గోల్‌కీపర్, కెపె్టన్ గుర్‌ప్రీత్ సింగ్ నిలువరించాడు. ఆ తర్వాతి బంతి గోల్ లైన్ దాటి బయటకు వెళ్లింది.
కానీ అక్కడే ఉన్న ఖతర్ ఆటగాడు హాష్మీ అల్ హుస్సేన్ బంతిని వెనక్కి పంపించగా, యూసుఫ్ ఆ బంతిని లక్ష్యానికి చేర్చాడు. రిఫరీ దీనిని గోల్‌గా ప్రకటించాడు. దాంతో భారత ఆటగాళ్లు నివ్వెరపోయి రివ్యూ చేయాలని రిఫరీని కోరినా ఆయన అంగీకరించకుండా గోల్ సరైనదేనని ప్రకటించాడు.
టీవీ రీప్లేలో బంతి గోల్‌లైన్ దాటి బయటకు వెళ్లిందని స్పష్టంగా కనిపించినా భారత ఆటగాళ్ల మొరను రిఫరీ ఖాతరు చేయలేదు. ఈ సంఘటనతో భారత బృందం ఏకాగ్రత చెదిరింది. 85వ నిమిషంలో అహ్మద్ అల్‌రావి గోల్‌తో ఖతర్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లి చివరి నిమిషం వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment