క్రికెట్‌కు విరామం.. ఫుట్‌బాల్‌ ఆడిన సంజూ శాంసన్‌ | Sanju Samson Playing A Local Football Match | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు విరామం.. ఫుట్‌బాల్‌ ఆడిన సంజూ శాంసన్‌

Published Sat, Dec 30 2023 7:31 PM | Last Updated on Sat, Dec 30 2023 7:35 PM

Sanju Samson Playing A Local Football Match - Sakshi

టీమిండియా వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌ క్రికెట్‌కు పాక్షికంగా విరామం పలికినట్లున్నాడు. నిత్యం ఏదో ఒక క్రికెట్‌ టోర్నీతో బిజీగా ఉండే సంజూ.. తాజాగా తన సొంత రాష్ట్రమైన కేరళలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడుతూ కనిపించాడు. సెవెన్స్‌ టోర్నీలో భాగంగా ఓ స్థానిక జట్టుకు సంజూ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ ప్రావీణ్యం కలిగిన ఈ డాషింగ్‌ క్రికెటర్‌.. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌లా గేమ్‌ ఆడుతూ ఆకట్టుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో పాతదని కొందరు.. ఇటీవలే ఆడినదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సంజూ అభిమానులు అతని ఫుట్‌బాల్‌ టాలెంట్‌ను చూసి ముగ్దులవుతున్నారు.

ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌ ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సంజూ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ  సెంచరీ బాదాడు. పార్ల్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సంజూ 114 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. సంజూకు ఏ ఫార్మాట్‌లో అయినా (అంతర్జాతీయ స్థాయి) ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌లో సంజూ పేరిట మూడు శతకాలు ఉన్నాయి. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సంజూ సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/30) విజృంభించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందగా.. నిర్ణయాత్మకమైన మూడో వన్డే భారత్‌ గెలుపొంది 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఇదే పర్యటనలో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో డ్రా కాగా.. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ నడుస్తుంది. ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్ట్‌ జరుగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement