ఫుట్‌బాల్ చరిత్రలో జర్మనీది ప్రత్యేక స్థానం. సాకర్ సమరంలో నాలుగుసార్లు చాంపియన్స్‌గా నిలిచిన జర్మనీ.. అత్యధిక వరల్డ్‌కప్స్ సాధించిన జట్టుగా ఇటలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. 2014లో జర్మనీ నాలుగోసారి చాంపియన్స్‌గా అవతరించింది. అంతకముందు 1954,1974,1990లో ఫిఫా వరల్డ్‌కప్ అందుకుంది. కానీ ఇదంతా గతం.
చివరగా 2014లో ఫిఫా వరల్డ్ చాంపియన్స్‌గా నిలిచిన జర్మనీ వరుసగా రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశను దాటలేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేదు. థామస్ ముల్లర్, మారియో గోట్జే, లుకాస్ క్లోస్టర్‌మెన్, జోనస్ హాప్‌మన్ ఇలా ఎవరికి వారే సాటి. కానీ ఈ వరల్డ్‌కప్‌లో మాత్రం వీళ్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత సంచలనం నమోదైంది. కోస్టారికాపై 4-2 తేడాతో ఘన విజయం సాధించినప్పటికి జర్మనీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అందుకు కారణం జర్మనీ తమ తొలి మ్యాచ్ జపాన్ చేతిలో ఓడడమే. ఆ తర్వాత బలమైన స్పెయిన్‌తో మ్యాచ్ డ్రా చేసుకోవడం ఆ జట్టును కొంపముంచింది. ఆ తర్వాత జపాన్.. స్పెయిన్‌ను ఓడించడంతో జర్మనీ కథ ముగిసింది. ఓటమికి తోడు దురదృష్టం కూడా తోడవ్వడంతో జర్మనీ వరుగగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నుంచి భారంగా వైదొలిగింది. ఇక స్పెయిన్‌తో పాటు జపాన్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి.
ఇక జర్మనీలో వ్యక్తిగతంగా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టుగా విఫలమైందని ఆ దేశ అభిమానులు పేర్కొన్నారు. అభిమానులే కాదు అక్కడి మీడియా కూడా జర్మనీ ఫుట్‌బాల్ టీంపై విమర్శలు వ్యక్తం చేసింది. ''వ్యక్తిగతంగా చూస్తే అందరు మంచి ఆటగాళ్లుగానే కనిపిస్తున్నారు.. కానీ జట్టులా చూస్తే అలా అనిపించడం లేదు. 2014లో జర్మనీ ఫిఫా వరల్డ్‌కప్ గెలవడంలో బాస్టియన్ ష్వీన్‌స్టీగర్ , లుకాస్ పోడోల్స్కీలది కీలకపాత్ర. వారు రిటైర్ అయ్యాకా జర్మనీ ఆట కళ తప్పింది. జర్మనీ జట్టు వైభవం కూడా వారితోనే పోయింది. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు తమ ప్రయోజనాల కోసం ఆడతున్నారు తప్పిస్తే ఒకటిగా కలిసి ఆడడం లేదు. ఇదే మా కొంపముంచింది. మాకు ఇది కావాల్సిందే'' అంటూ కామెంట్ చేశారు.
నాలుగుసార్లు ఛాంపియన్ అయిన ఇటలీ కనీసం ఫిఫాకు అర్హత సాధించలేదు. అర్హత సాధించిన జర్మనీ కూడా వైదొలగడం సగటు ఫిఫా అభిమానిని బాధిస్తుంది. రెండు పెద్ద జట్లు లేకుండానే ఫిఫా వరల్డ్‌కప్ ముందుకు సాగుతుంది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ వరకైనా బలంగా తయారవ్వాలని.. మునుపటి ఆటతీరు ప్రదర్శిచాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment