రైతులతో చర్చలు కొనసాగుతాయ్‌ | Sakshi
Sakshi News home page

రైతులతో చర్చలు కొనసాగుతాయ్‌

Published Thu, Jan 14 2021 4:54 AM

Talks with farmers must continue says Parshottam Rupala - Sakshi

న్యూఢిల్లీ: కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరిషోత్తం రూపాల చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు.  15వ తేదీన 9వ దఫా చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు లోహ్రీ(భోగీ) మంటల్లో దహనం చేశారు.

ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సింఘు బోర్డర్‌ వద్ద బుధవారం లక్ష ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధి పరమ్‌జిత్‌సింగ్‌ చెప్పారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో లోహ్రీ పంటల పండుగ. మూడు కొత్త చట్టాలను కేంద్ర సర్కారు రద్దు చేసిన రోజే తాము పండుగ జరుపుకుంటామని హరియాణా రైతు గురుప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు. ఢిల్లీ–హరియాణా రహదారిపై పలుచోట్ల నిరసనకారులు లోహ్రీ మంటలు వెలిగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

26న కిసాన్‌ పరేడ్‌
26న వేల ట్రాక్టర్లతో ఢిల్లీ శివార్లలో పరేడ్‌ నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్‌ సంఘర్‌‡్ష కో–ఆర్డినేషన్‌ కమిటీ ప్రకటించింది. ఢిల్లీకి చుట్టూ 300 కిలోమీటర్లలోపు ఉన్న అన్ని జిల్లాల ప్రజలు ఒకరోజు ముందే నగర శివార్లకు చేరుకోవాలని పిలుపునిచ్చింది.

Advertisement
Advertisement