అతివకు అందలం! | Sakshi
Sakshi News home page

అతివకు అందలం!

Published Thu, Mar 21 2024 4:56 AM

Women Workforce Participation Soars to 37percent in 2022-23 - Sakshi

శ్రామికశక్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం

మహిళల నియామకంలో  హైదరాబాద్, పుణే, చెన్నై టాప్‌

ముంబై: దేశంలో ఉద్యోగాలు, ఇతర క్రియాశీలక పనుల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోంది. మహిళా సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని చెప్పొచ్చు. ఇండియాలో 140 కోట్లకుపైగా జనాభా ఉండగా, వీరిలో 69.2 కోట్ల మంది మహిళామణులే. వీరిలో దాదాపు 37 శాతం మంది ఉద్యోగాలు, క్రియాశీలక పనుల్లో కొనసాగుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

‘కెరీర్‌నెట్స్‌’ అనే సంస్థ ‘ఇండియాలో మహిళా ఉద్యోగుల స్థితిగతులు’ పేరిట తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో హైదరాబాద్, పుణే, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2022తో పోలిస్తే 2023లో శ్రామికశక్తిలో అతివల ప్రాతినిధ్యం 2 నుంచి 5 శాతం పెరిగినట్లు తెలియజేసింది. జూనియర్‌ ప్రొఫెషన్‌ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్‌ బోర్డుల్లో వారి భాగస్వామ్యం పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే..  

► 2023లో కాలేజీల నుంచి వచ్చి కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు.  
► ఒకటి నుంచి ఏడేళ్ల అనుభవం ఉన్న మహిళలకు కొత్తగా జరుగుతున్న నియామకాల్లో 20 నుంచి 25 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి.  
► దేశ రాజధాని ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో మహిళల నియామకం పెరిగింది. ఢిల్లీలో మాత్రం తగ్గిపోయింది.  
► ఉద్యోగాల్లో మహిళల నియామకం రేటు హైదరాబాద్‌లో 34 శాతం, పుణేలో 33 శాతం, చెన్నైలో 29 శాతంగా నమోదైంది. ఢిల్లీలో ఇది కేవలం 20 శాతంగా ఉంది.

Advertisement
Advertisement