పట్టాలు తప్పిన బీజేడీ పాలన | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన బీజేడీ పాలన

Published Thu, May 9 2024 4:25 AM

పట్టా

● ఒడిశాలో రామరాజ్యం తీసుకొస్తాం ● కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ● రాయగడలో ఎన్నికల ప్రచారం

రాయగడ: ఎంతో నమ్మకంతో ఒడిశా రాష్ట్ర ప్రజలు బీజేడీ పార్టీని నమ్మారు. వారి అమాయకత్వాన్ని ఆసరగా తీసుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు. అయితే ఆయన పాలన పట్టాలు తప్పింది. ప్రజలకు సుస్థిర పాలన అందించడం మాట అటుంచితే వారి నమ్మకాలను వమ్ము చేశారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన బుధవారం రాయగడకు వచ్చి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక జీఐఏసీఆర్‌ మైదానంలో విజయసంకల్ప సమావేశం పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తి పొశారు. ఆర్థిక రంగంలో ఒడిశా రాష్ట్రం చాలా వెనుకబడిందని అన్నారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలోప్రజలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆదివాసీ, హరిజన తెగలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రగతి జాడలు కనిపించలేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

రాష్ట్రంలో రామరాజ్యం ఖాయం

త్వరలొ జరగనున్న ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి ప్రజలు మద్దతు పలికితే రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌ మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే డబల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పనితీరు ఎలా ఉంటుందో చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగతిని చూపిస్తామని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యే శ్రద్ధ కనబరుస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కేలా తగుచర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులే దేశానికి వెన్నెముక అన్న నానుడికి సరైన అర్థాన్ని చూపిస్తామని పేర్కొన్నారు. ఆధునిక, సాంకేతిక పరంగా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. కొత్త పరిశ్రమలకు బాటలు వేసి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు మార్గాలను అన్వేషిస్తామన్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

అధికార బీజేడీ పాలనలో విసుగెత్తిన ప్రజలు మార్పు కొరుకుంటున్నారని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. ప్రచార సభలకు ఎక్కడికి వెళ్లినా ప్రజలు గళమెత్తి చెబుతున్నారని అన్నారు. దీనిబట్టి చూస్తే ఈసారి ఒడిశాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పొటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.

అగ్రరాజ్యాల్లో భారత్‌కు ప్రత్యేక గౌరవం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపొయిందని రాజ్‌నాథ్‌ అన్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యాల్లో భారతదేశం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగిందని చెప్పారు. ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని అన్నారు. పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషిచేసినట్టు వివరించారు. సుమారు 25 కోట్ల మంది పేదిరికం నుంచి బయటపడేలా మోదీ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధను తీసుకుందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేలకు వరాలుగా మారాయన్నారు. సుమారు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ వంటి పాలనకు మద్దతు పలికితే మరో 60 ఏళ్లు దేశం వెనుకబడటం ఖాయమని అన్నారు. ఆధునిక, సాంకేతిక రంగాల్లో దూసుకుపొతున్న దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ఈసారి కూడా మోదీసర్కార్‌ అనివార్యమని చెప్పారు. ప్రజలు దీన్ని గమనించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు.

కరోనా సమయంలో..

కరోన వంటి విపత్కర సమయంలో దేశం అతలాకుతలం అయిందన్నారు. అయితే ఈ మహమ్మారిని తరిమికొట్టే విషయంలో మన వైజ్ఞానికులు ఎంతో శ్రమించారని కొనియాడారు. మన దేశంలో కనిపెట్టిన కరోన నిరోధక వ్యాక్సిన్లు ఇతర దేశాలకు పంపించడంలో సత్తాచాటుకున్నామన్నారు. మన దేశం వైజ్ఞానిక పరంగా మరింత ముందుకు దూసుకుపోతోందన్నారు. భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకువచ్చిన ప్రధాని మోదీని మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అందరికీ పక్కా గృహాలు

కూడు, గూడు, గుడ్డ వంటి మౌలిక సౌకర్యాలను ప్రజలకు అందేలా బీజేపీ సర్కార్‌ ఎన్నో సంస్కరణలను తీసుకువస్తుందని అన్నారు . మరో ఐదేళ్ల పాలనలో అర్హులైన అందరికీ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడమే ధ్యేయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాయగడ జిల్లాలోని మూడు అసెంబ్లీ, కొరాపుట్‌ లొక్‌సభ స్థానాలకు బీజేపీ తరఫున పొటీ చేస్తున్న అభ్యర్థులు యువకులని వారిని గెలిపించాలని కోరారు.

రాజ్‌నాథ్‌కు ఘన సన్మానం

బహిరంగ సభకు హాజరైన రాజ్‌నాథ్‌ సింగ్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ పట్నాయక్‌, పార్టీ సీనియర్‌ నాయకులు గొవింద్‌ జైన్‌, కార్యకర్తలు గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాయగడ మజ్జిగౌరి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్‌ సమితి పర్శాలిలోని డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీ మహిళలు స్వయంగా రూపొందించిన సాల్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు అందజేశారు. కేంద్ర మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసి ఫొటో దిగారు.

పట్టాలు తప్పిన బీజేడీ పాలన
1/2

పట్టాలు తప్పిన బీజేడీ పాలన

పట్టాలు తప్పిన బీజేడీ పాలన
2/2

పట్టాలు తప్పిన బీజేడీ పాలన

Advertisement
 
Advertisement
 
Advertisement