పరిటాల వర్సెస్‌ వరదాపురం | Sakshi
Sakshi News home page

పరిటాల వర్సెస్‌ వరదాపురం

Published Mon, Jan 1 2024 5:01 AM

Clash between Sriram and Suri clans in Mudigubba - Sakshi

ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గంలో అశాంతి రాజేసేలా ఇరువర్గాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్న వరదాపురం సూరి వర్గీయులు టీడీపీలో చేరుతున్నామనే సంకేతాలిచ్చేందుకు ముదిగుబ్బ మండల కేంద్రంలో సొసైటీ సర్కిల్‌ వద్ద చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ప్రధానంగా ఘర్షణకు కారణమయ్యాయి.

పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత నెల కూడా గడవక ముందే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పరిటాల శ్రీరామ్‌ వ్యవహరిస్తున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలో టీడీపీలోకి చేరతామని, ఆ పార్టీ టికెట్‌ తనకేనంటూ  కొంత కాలంగా సూరి తన అనుచరులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు.

ఇదిలా ఉండగా, వరదాపురం సూరి రెండు రోజుల కిందట ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓ మాజీ మంత్రి అని, వారు ధర్మవరం, శింగనమల, పెనుకొండలకు వెళితే వైఎస్సార్‌సీపీకి పనిచేస్తారని, ఒక్క రాప్తాడులో మాత్రం టీడీపీకి పని చేస్తారని, ధర్మవరం చెరువుకు నీరు అందించేందుకు తాను సొంత నిధులతో కాలువ మరమ్మతులు చేయిస్తే.. వాటికి కూడా నాడు –నేడు కింద బిల్లులు చేసుకున్నారని పరోక్షంగా పరిటాల సునీతను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. 

మీ పార్టీ నాయకుల ఫొటోలు వేసుకోండి..  
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ముదిగుబ్బ మండలంలో వర­దాపురం సూరి అనుచరులు పసుపు రంగు ఫ్లెక్సీల ఏర్పాటుకు పూనుకున్నా­రు. అందులో వరదాపురంతో పాటు చంద్రబాబు, నారా లోకేశ్‌ ఫొటోలు వే­యించా­రు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీరు బీజేపీలో ఉన్నందు వల్ల ఆ పార్టీ నాయకుల బొమ్మలు వే­సుకోండి. అంతేగానీ చంద్ర­బాబు, లోకే­శ్‌ ఫొటోలు ఎలా వేస్తా­రు? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మ­ధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసు­కుంది. పరస్పరం చెప్పులు విసురుకున్నా­రు. ముదిగుబ్బ ఎస్‌ఐ వంశీకృష్ణ ఘ­ట­నా స్థలానికి చేరు­కుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వి­వా­దం ముదురుతుండటంతో సూరి వర్గీయులు వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించి వెనుదిరిగారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement