3 విడతల్లో ప్రచారం  | Sakshi
Sakshi News home page

3 విడతల్లో ప్రచారం 

Published Fri, Apr 19 2024 6:15 AM

CM Revanth Reddy Focus On Lok Sabha Elections - Sakshi

14 సీట్లలో గెలుపు లక్ష్య సాధనపై రేవంత్‌ దృష్టి 

పార్టీలో పట్టు నిరూపించు కోవాలనే పట్టుదలతో ముందుకు 

నేటి నుంచి మొదలుకానున్న రాష్ట్ర పర్యటన 

ఒకవైపు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి హాజరు 

మరోవైపు బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ ఖరారు! 

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని చెబుతున్న సీఎం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం మేరకు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీలో తన పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే నెల 13న పోలింగ్‌ నేపథ్యంలో 11వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకునే వీలుంది.

ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని మూడు విడతలుగా చేపట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు సీట్లకు గాను మూడు దఫాల్లో 14 ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. మధ్యలో జాతీయ నాయకులతో కూడా ప్రచారం చేయించే ఆలోచనతో ఉన్నారు. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో రెండురోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ వచి్చన రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచే తన కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. వీలైనంత మేరకు పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. 

మహబూబ్‌నగర్‌ నుంచి మొదలు 
తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానంలో పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి విజయాన్ని రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు 12 మంది కాంగ్రెస్‌ వారే ఉండడం, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డితో పాటు పార్లమెంటు పరిధిలోని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు పలువురు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వంశీచంద్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి ఆయన హాజరు కాను­న్నారు. కాగా సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగసభలో సీఎం పాల్గొననున్నా­రు. మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ కూడా శుక్రవారమే నామినేషన్‌ వేయనున్నారు.  

గ్రేటర్‌పై స్పెషల్‌ ఫోకస్‌ 
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం కాంగ్రెస్‌ విఫలమైంది. రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరితో పాటు సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాలపై సీఎం రేవంత్‌ స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టారు. ఆపరేషన్‌ ఆకర్‌‡్షలో భాగంగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకొని చేతిగుర్తుపై పోటీ చేయిస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకొని ఆయన సతీమణి సునీతరెడ్డికి మల్కాజిగిరి సీటిచ్చారు. ఇక సికింద్రాబాద్‌కు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మూడు సీట్లలో గెలుపు కోసం పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్‌ పరిధిలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.  

వరుసగా సభలు 
కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో నియోజకవర్గం మెదక్‌. గతంలో కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహించిన ఈ స్థానం నుంచి ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పోటీ పడుతున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలం మధు బరిలో ఉన్నారు. కాగా 20వ తేదీన మధు నామినేషన్‌ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక 22న ఉదయం ఆదిలాబాద్‌లో, 23న నాగర్‌కర్నూల్‌లో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సభల్లో పాల్గొనడం ద్వారా పార్టీ ప్రచారం నిర్వహించనున్నారు. 

ఉత్తర తెలంగాణపై దృష్టి 
మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే రెండో విడతలో గ్రేటర్‌లోని మూడు స్థానాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని స్థానాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల విజయం కోసం భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా రెండు, మూడు విడతల్లో పార్టీ కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement