దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్‌లోని పోర్‌బందర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్‌బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
మన్సుఖ్ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్‌బందర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.
తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్‌బందర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment