ఐదు మ్యాచ్‌ల అనధికారిక టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా నిన్న (మే 1) జరిగిన మూడో మ్యాచ్‌లో పర్యాటక జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ మెరుపు శతకం (61 బంతుల్లో 119 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో ఛార్లెస్ ఊచకోత ధాటికి నేపాల్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో నేపాల్ సంచలన విజయం సాధించగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో విండీస్ విజయం సాధించింది. ఇవాళ (మే 2) నాలుగో టీ20 జరుగుతుంది.
మూడో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఛార్లెస్‌తో పాటు ఆండ్రీ ఫ్లెచర్ (33 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. అలిక్ అథనాజ్ 17, ఫేబియన్ అలెన్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కీమో పాల్ 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, సాగర్ ధకల్ తలో వికెట్ పడగొట్టగా.. అథనాజ్ రనౌటయ్యాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్ల దెబ్బకు 19.2 ఓవర్లలో 151 పరుగులకే బిచానా సర్దేసింది. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ 3 వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ 2, మాథ్యూ ఫోర్డ్, ఓబెద్ మెక్‌కాయ్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో లోకేశ్ బమ్, కరణ్ తలో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ సిరీస్‌లో వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.
Comments
Please login to add a commentAdd a comment