రోహిత్‌ వీరోచిత శతకం.. విండీస్‌కు షాకిచ్చిన నేపాల్‌ | Nepal Beat West Indies A By 4 Wickets In First T20 Of Five Match Series In Kirtipur | Sakshi
Sakshi News home page

రోహిత్‌ వీరోచిత శతకం.. విండీస్‌కు షాకిచ్చిన నేపాల్‌

Published Sat, Apr 27 2024 4:14 PM | Last Updated on Sat, Apr 27 2024 4:14 PM

Nepal Beat West Indies A By 4 Wickets In First T20 Of Five Match Series In Kirtipur

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌-ఏ క్రికెట్‌ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) తొలి టీ20 జరిగింది. కిరీటీపూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య నేపాల్‌ తమకంటే చాలా రెట్లు మెరుగైన విండీస్‌-ఏకు ఊహించని షాకిచ్చింది. 

ఈ మ్యాచ్‌లో నేపాల్‌ విండీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ వీరోచిత శతకం బాదాడు. ఫలితంగా నేపాల్‌ విండీస్‌పై సంచలన విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. అలిక్‌ అథనాజ్‌ (47), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (74), కీసీ మెక్‌కార్తీ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నేపాల్‌ బౌలర్లలో కమల్‌, దీపేంద్ర, రోహిత్‌, అభినాష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌.. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (54 బంతుల్లో 112; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రోహిత్‌కు సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించప్పటికీ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించుకున్నాడు. 

నేపాల్‌ బ్యాటర్లలో దీపేంద్ర (24), కుశాల్‌ మల్లా (16), కుశాల్‌ భుర్టెల్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్‌, మెక్‌కాయ్‌ తలో రెండు వికెట్లు, కీమో పాల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. రెండో టీ20 ఇదే వేదికగా రేపు జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement