స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన ఆఖరి టీ20లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (26 బంతుల్లో 69; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విండీస్‌ను గెలిపించాడు. కెప్టెన్ బ్రాండన్ కింగ్ (28 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కైల్ మేయర్స్ (23 బంతుల్లో 36 నాటౌట్; 4 సిక్సర్లు) సైతం ఆకట్టుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ, పీటర్‌కు తలో వికెట్ దక్కింది.
దీనికి ముందు ఓబెద్ మెక్‌కాయ్ (4-0-39-3), గుడకేశ్ మోటీ (3-0-21-2), షమార్ జోసఫ్ (4-0-26-2) ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ అల్లాడిపోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డస్సెన్ (51), వియాన్ ముల్దర్ (36) మాత్రమే రాణించారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లను కూడా వెస్టిండీసే గెలిచింది. తొలి మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో.. రెండో టీ20లో 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చరిత్రలో విండీస్ టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడం ఇదే మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment