గిల్, సాయి శతకాల మోత | Sakshi
Sakshi News home page

గిల్, సాయి శతకాల మోత

Published Sat, May 11 2024 4:29 AM

Gujarat beat Chennai by 35 runs

తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యం

చెన్నైపై 35 పరుగులతో నెగ్గి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచిన గుజరాత్‌ 

మిచెల్, అలీ పోరాటం వృథా  

అహ్మదాబాద్‌: గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటాన్స్‌ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్‌ చుక్కలు చూపించారు. 

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సూపర్‌కింగ్స్‌ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్‌ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), సుదర్శన్‌ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగారు.

తుషార్‌ దేశ్‌పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్‌ మిచెల్‌ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. మోహిత్‌ శర్మ 3, రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశారు. 

జోరు కాదు... ఓపెనర్ల హోరు... 
పవర్‌ ప్లేలో 58/0 స్కోరు చేసిన టైటాన్స్‌ ఓపెనర్లు ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముందుగా సాయి సుదర్శన్‌ 32 బంతుల్లో, గిల్‌ 25 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేశారు. పేస్, స్పిన్, స్లో మీడియం ఇలా ఆరుగురు చెన్నై బౌలర్లు 17 ఓవర్ల వరకు వైవిధ్యం చూపినా... వాళ్లిద్దరు మాత్రం అడ్డు అదుపు లేకుండా శరవేగంగా పరుగుల్ని రాబట్టారు. 

సెంచరీ మాత్రం ముందుగా శుబ్‌మన్‌ 50 బంతుల్లో పూర్తిచేయగా, తర్వాత సుదర్శన్‌ కూడా 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ పరుగుల తుఫాన్‌ను ఎట్టకేలకు డెత్‌ ఓవర్లకు గానీ విడగొట్టలేకపోయారు. 

తుషార్‌ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన సాయి సుదర్శన్‌... శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్ర మించాడు.దీంతో ఓపెనింగ్‌ వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో చెన్నై శిబిరంలో తొలిసారి ఆనందం కనబడింది. అదే ఓవర్లో కెపె్టన్‌ గిల్‌ కూడా అవుట్‌ కావడంతో సూపర్‌కింగ్స్‌ ఊపిరి పీల్చుకుంది.  

అన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు... ఇద్దరివే! 
17.2 ఓవర్లు ఓపెనర్లే ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగందుకుంది. మెరుపులతో జోరందుకుంది. ఓపెనింగ్‌కు ఇరువైపుల వేగం, వేగం కనిపించడంతో మోదీ స్టేడియం గుజరాత్‌ అభిమానుల కేరింతలతో మార్మోగింది. సుదర్శన్, గిల్‌ ఇద్దరు అదేపనిగా దంచేయడంతో ఫోర్లతో సిక్సర్లు కూడా పోటీపడ్డాయి.

 14 ఫోర్లు, 13 సిక్స్‌లు బాదేయడంతో 210 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యంలో 134 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆరో ఓవర్లో 50కి చేరిన గుజరాత్‌ స్కోరు... 100 పరుగుల్ని పదో ఓవర్లో దాటింది. 150 పరుగుల్ని మరింత వేగంగా 13వ ఓవర్లోనే అధిగమించింది. 17వ ఓవర్లో 200 మైలురాయికి చేరింది.  

ఆరంభంలోనే దెబ్బ  
తొలి ఓవర్లో రచిన్‌ రవీంద్ర (1), రెండో ఓవర్లో రహానే (1), మూడో ఓవర్లో కెపె్టన్‌ రుతురాజ్‌ (0) వరుస కట్టడంతో కొండంత లక్ష్యఛేదన చెన్నైకి అసాధ్యంగా మారింది. మిచెల్, మొయిన్‌ అలీ అర్ధసెంచరీలతో చేసిన పోరాటం సూపర్‌కింగ్స్‌ ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది తప్ప... లక్ష్యంవైపు నడిపించలేకపోయింది.

 హిట్టర్‌ శివమ్‌ దూబే (21; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టైటాన్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలొగ్గారు. ధోని (11 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖర్లో సిక్సర్లతో అలరించాడు. 

2 ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ తొలుత ఈ ఘనత సాధించారు.

100 శుబ్‌మన్‌ గిల్‌ శతకం ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో 100వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌ ప్రారంభమైన ఏడాది 2008 ఏప్రిల్‌ 18న జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ మొదటి సెంచరీ చేశాడు. మొత్తం 17 ఐపీఎల్‌ సీజన్‌లలో ఇప్పటి వరకు 1084 మ్యాచ్‌లు జరిగాయి.  

2 ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో తొలి వికెట్‌కు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భాగ స్వామ్యం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (68 నాటౌట్‌), డికాక్‌ (140 నాటౌట్‌) తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించారు.  

స్కోరు వివరాలు 
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) దూబే (బి) తుషార్‌ 103; శుబ్‌మన్‌ గిల్‌ (సి) జడేజా (బి) తుషార్‌ 104; మిల్లర్‌ (నాటౌట్‌) 16; షారుఖ్‌ ఖాన్‌ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–210, 2–213, 3–231. బౌలింగ్‌: సాన్‌ట్నర్‌ 2–0–31–0, తుషార్‌ 4–0–33–2, శార్దుల్‌ 4–0–25–0, సిమర్‌జీత్‌ 4–0–60–0, జడేజా 2–0–29–0, మిచెల్‌ 4–0–52–0. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) తెవాటియా (బి) సందీప్‌ వారియర్‌ 1; రచిన్‌ (రనౌట్‌) 1; రుతురాజ్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) ఉమేశ్‌ 0; మిచెల్‌ (సి) షారుఖ్‌ (బి) మోహిత్‌ 63; అలీ (సి) నూర్‌ అహ్మద్‌ (బి) మోహిత్‌ 56; దూబే (సి) నూర్‌ (బి) మోహిత్‌ 21; జడేజా (సి) మిల్లర్‌ (బి) రషీద్‌ 18; ధోని (నాటౌట్‌) 26; సాన్‌ట్నర్‌ (బి) రషీద్‌ 0; శార్దుల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–10, 4–119, 5–135, 6–165, 7–169, 8–169. బౌలింగ్‌: ఉమేశ్‌ 3–0–20–1, సందీప్‌ వారియర్‌ 3–0–28–1, త్యాగి 4–0–51–0, నూర్‌ అహ్మద్‌ 2–0–25–0, రషీద్‌ ఖాన్‌ 4–0–38–2, మోహిత్‌ 4–0–31–3.   

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X  ముంబై 
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

 
Advertisement
 
Advertisement