IPL 2023: Nitish Rana has earned the respect of every individual in KKR dressing room, says Venkatesh Iyer - Sakshi
Sakshi News home page

#Venkatesh Iyer: క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! సంతోషంగా ఉంది!

Published Mon, May 8 2023 3:54 PM

IPL 2023: Nitish Earned Respect Of Every Individual: Venkatesh Iyer - Sakshi

IPL 2023 KKR- Venkatesh Iyer: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణాపై ఆ జట్టు ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రశంసలు కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నానంటూ సారథిగా బాధ్యతలు భుజాన వేసుకున్నాడని కొనియాడాడు. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల గౌరవం, అభిమానం పొందాడని.. అతడి విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు.

అయ్యర్‌ దూరం కావడంతో
ఐపీఎల్‌-2023కు ముందు కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌ సందర్భంగా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీమిండియాకు దూరమైన అతడు.. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ స్థానంలో నితీశ్‌ రాణాకు కేకేఆర్‌ పగ్గాలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది.

అతడెందుకని విమర్శలు
కెప్టెన్సీ రేసులో సీనియర్‌ సునిల్‌ నరైన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ పేర్లు వినిపించినప్పటికీ.. మేనేజ్‌మెంట్‌ రాణా వైపు మొగ్గు చూపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో నరైన్‌, సౌథీ వంటి సీనియర్లను కాదని రాణాను సారథిగా నియమించడం సరికాదంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

అయితే, దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపిస్తున్న నితీశ్‌ రాణాకు అతడి అభిమానులు మద్దతుగా నిలిచారు. కౌంటర్‌ అటాక్‌తో అతడిని విమర్శిస్తున్న వాళ్లకు సమాధానమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేకేఆర్‌ పగ్గాలు చేపట్టాడు నితీశ్‌ రాణా.

బ్యాటర్‌గా రాణిస్తున్నాడు
బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేకేఆర్‌ కేవలం నాలుగింట మాత్రమే గెలుపొంది పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ చేరుకోలేదు.

ఈ నేపథ్యంలో నితీశ్‌ రాణా గురించి ఆ జట్టు ఓపెనర్‌, సెంచరీ వీరుడు వెంకటేశ్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌తో మే 8 నాటి మ్యాచ్‌ నేపథ్యంలో ఇండియా టుడే ముచ్చటించాడు అయ్యర్‌. ఈ సందర్భంగా కెప్టెన్‌ నితీశ్‌ రాణా, కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ గురించి ప్రశ్న ఎదురైంది.

చందూ సర్‌ కోచ్‌గా రావడం సంతోషం
ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో చందూ సర్‌తో మూడేళ్లపాటు కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆయనే ఐపీఎల్‌ కోచ్‌గానూ రావడం బాగుంది. ఈ విషయంలో నాకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. 

ఇక నితీశ్‌ రాణా విషయానికొస్తే.. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడిన సమయంలో జట్టును నడిపించేందుకు అతడు ముందుకు వచ్చాడు. శ్రేయస్‌ సేవలు కోల్పోయి జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బాధ్యత తను తీసుకున్నాడు. 

అతడికి సాధ్యమైంది
నా వరకు కెప్టెన్‌గా అతడు బాగానే రాణిస్తున్నాడు. డ్రెస్సింగ్‌ రూంలో ప్రతీ ఆటగాడితో మమేకం అవుతాడు. అందరూ అతడి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. కెప్టెన్‌గా అందరితో కలిసిపోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. రాణా కూడా వారిలో ఒకడు’’ అని మధ్యప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో వెంకటేశ్‌ ఇప్పటి వరకు 303 పరుగులు చేయగా.. నితీశ్‌ రాణా 275 పరుగులు సాధించాడు.

చదవండి: సన్‌రైజర్స్‌ విజయంపై డేవిడ్‌ వార్నర్‌ ట్వీట్‌! మెచ్చుకున్నాడా? లేదంటే..

Advertisement
 
Advertisement