11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన అశుతోష్‌.. యువరాజ్‌ రికార్డు బద్దలు | Sakshi
Sakshi News home page

IPL 2024: 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన అశుతోష్‌.. యువరాజ్‌ రికార్డు బద్దలు

Published Fri, Apr 19 2024 3:03 PM

IPL 2024: PBKS Batting Sensation Ashutosh Sharma Holds Second Fastest Fifty Record In T20s - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 18) జరిగిన మ్యాచ్‌లో  పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృస్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అశుతోష్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ విరుచుకుపడినప్పటికీ పంజాబ్‌కు పరాభవం తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యానికి పంజాబ్‌ 10 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. 

కాగా, అశుతోష్ పేరిట టీ20ల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌‌ హాఫ్‌ సెంచరీ ఉన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. సరిగ్గా ఆరు నెలల కిందట సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో అశుతోష్‌ 11 బంతుల్లో ఫిఫ్టి కొట్టాడు. ఆ టోర్నీలో రైల్వేస్‌కు ఆడిన అశుతోష్‌.. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో 11 బంతుల్లో బౌండరీ, ఎనిమిది సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. 

ఈ మెరుపు ఇన్నింగ్స్‌ తర్వాత అశుతోష్‌.. యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉండిన  సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్‌ ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీగా కొనసాగింది. అయితే అశుతోష్‌ 11 బంతులు హాఫ్‌ సెంచరీ చేయడానికి నెల ముందు ఈ రికార్డుకు బీటలు పడ్డాయి. 2023 ఏషియన్‌ గేమ్స్‌లో నేపాల్‌ ఆటగాడు దీపేంద్ర సింగ్‌.. మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 

ఇదిలా ఉంటే, 25 ఏళ్ల అశుతోష్‌ తన తొలి ఐపీఎల్‌ సీజన్‌లో (2024) చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్‌లో అశుతోష్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 205.3 స్ట్రయిక్‌రేట్‌తో 52 సగటున 156 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అశుతోష్‌ ఇప్పటివరకు 13 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు.

ఐపీఎల్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అశుతోష్‌ స్కోర్లు ఇలా ఉన్నాయి. 

- 31(17).
- 33*(15).
- 31(26).
- 61(28).

Advertisement
Advertisement