‘కింగ్స్‌’ పోరులో పంజాబ్‌దే గెలుపు | Punjab Kings won by 7 wickets on chennai | Sakshi
Sakshi News home page

‘కింగ్స్‌’ పోరులో పంజాబ్‌దే గెలుపు

Published Thu, May 2 2024 4:01 AM | Last Updated on Thu, May 2 2024 8:59 AM

Punjab Kings won by 7 wickets on chennai

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైకు ఐదో ఓటమి

7 వికెట్లతో నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌

రాణించిన బ్రార్, చహర్‌  

చెన్నై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించింది. గత శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. బుధవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్లతో గెలిచింది. 

పంజాబ్‌ కింగ్స్‌ కెపె్టన్‌ స్యామ్‌ కరన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (48 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించాడు. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/17), రాహుల్‌ చహర్‌ (2/16) చెన్నై జట్టును కట్టడి చేశారు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయం సాధించింది.

 బెయిర్‌స్టో (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రిలీ రోసో (23 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 64 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక శశాంక్‌ సింగ్‌ (26 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), స్యామ్‌ కరన్‌ (20 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు) పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. 

గత మూడు సీజన్‌లలో చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 2022లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్‌ 2023లో చెన్నైలోనే జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలిచింది.  

కట్టడి చేసిన బ్రార్, చహర్‌ 
చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్, రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్‌ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిశాక చెన్నై ఇన్నింగ్స్‌ తడబడింది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్, రాహుల్‌ చహర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో బ్రార్‌ మూడు బంతుల తేడాలో రహానే, శివమ్‌ దూబే (0)లను పెవిలియన్‌కు పంపించాడు. 

ఆ తర్వాత పదో ఓవర్లో జడేజాను చహర్‌ అవుట్‌ చేశాడు. దాంతో చెన్నై జట్టు 64/0 నుంచి 70/3తో కష్టాల్లో పడింది. బ్రార్, చహర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ చెన్నై జట్టు బ్యాటర్లు వరుసగా ఎనిమిది ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. రబడ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతికి రిజ్వీ బౌండరీ కొట్టి ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. 

స్యామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ రెండో బంతిని బౌండరీ దాటించిన రుతురాజ్, మూడో బంతికి సిక్స్‌ కొట్టి 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్‌ చివరి బంతిని రుతురాజ్‌ సిక్స్‌గా మలచడంతో ఈ ఓవర్లో చెన్నైకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన అర్‌‡్షదీప్‌ లయ తప్పి మూడు వైడ్‌లు వేసినా రుతురాజ్‌ను బౌల్డ్‌ చేశాడు. 

ఆ తర్వాత అర్‌‡్షదీప్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లోనూ రెండు వైడ్‌లతో కలిపి ఎనిమిది బంతులు వేశాడు. ఈ ఓవర్లో ధోని ఒక ఫోర్, ఒక సిక్స్‌ కొట్టి చివరి బంతికి రనౌట్‌ అయ్యాడు. పంజాబ్‌ స్పిన్నర్లు బ్రార్, చహర్‌ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అజింక్య రహానే (సి) రోసో (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29; రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 62; శివమ్‌ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 0; రవీంద్ర జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాహుల్‌ చహర్‌ 2; సమీర్‌ రిజ్వీ (సి) హర్షల్‌ పటేల్‌ (బి) రబడ 21; మొయిన్‌ అలీ (బి) రాహుల్‌ చహర్‌ 15; ధోని (రనౌట్‌) 14; డరైల్‌ మిచెల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–70, 4–107, 5–145,  6–147, 7–162. బౌలింగ్‌: రబడ 4–0–23–1, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–52–1, స్యామ్‌ కరన్‌ 3–0–37–0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–17–2, రాహుల్‌ చహర్‌ 4–0–16–2, హర్షల్‌ పటేల్‌ 1–0–12–0. 

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) రుతురాజ్‌ (బి) గ్లీసన్‌ 13; బెయిర్‌స్టో (సి) ధోని (బి) దూబే 46; రిలీ రోసో (బి) శార్దుల్‌ 43; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 25; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1–19, 2–83, 3–113. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 0.2–0–4–0, శార్దుల్‌ ఠాకూర్‌ 3.4–0–48–1, గ్లీసన్‌ 3.5–0–30–1, ముస్తఫిజుర్‌ 4–1–22–0, జడేజా 3–0–22–0, మొయిన్‌ అలీ 2–0–22–0, శివమ్‌ దూబే 1–0–14–1. 

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్‌  X  రాజస్తాన్‌
వేదిక: హైదరాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement