#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! | Sakshi
Sakshi News home page

IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!

Published Thu, Apr 11 2024 8:45 AM

IPL 2024: Sanju Reply On Reason Behind RR First Loss Stuns Commentator - Sakshi

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్‌ టైటాన్స్‌ అడ్డుకట్ట వేసింది. రాయల్స్‌ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్‌ పడటంపై రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు.

మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం
ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ చివరి బంతికి మ్యాచ్‌ మా చేజారింది. మ్యాచ్‌ ఓడిన కెప్టెన్‌గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది.

భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్‌ టైటాన్స్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత.

ఇది మా బౌలర్ల తప్పే
మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం.

కచ్చితంగా అది విన్నింగ్‌ స్కోరే. పిచ్‌పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్‌ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్‌లో 197.. తేమ లేని వికెట్‌పై డిఫెండ్‌ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు.

రాణించిన సంజూ, రియాన్‌ పరాగ్‌
కాగా జైపూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(24), జోస్‌ బట్లర్‌(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్‌(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. 

అంతా రషీద్‌ ఖాన్‌ వల్లే
ఆఖర్లో హెట్‌మెయిర్‌ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్‌) మెరిపించగా.. రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్‌ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. 

శుబ్‌మన్‌ గిల్‌(72) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌(11 బంతుల్లో 24- నాటౌట్‌) రాజస్తాన్‌ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్‌ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

రాజస్తాన్‌ వర్సెస్‌ గుజరాత్‌ స్కోర్లు
►రాజస్తాన్‌: 196/3 (20)
►గుజరాత్‌: 199/7 (20)
►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం.

చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్‌ రేట్‌.. గుజరాత్‌ సంచలన విజయం

Advertisement
Advertisement