కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలు | Sakshi
Sakshi News home page

కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలు

Published Sat, Jun 24 2023 3:34 AM

Celebrities in KP Chaudhary drug case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి అలియాస్‌ కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్‌ బాగ్‌ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్‌ అషురె­డ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ), రాజేంద్రనగర్‌ పోలీసులు కిస్మత్‌పూర్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చౌదరి సెల్‌ఫోన్‌లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. 

12 మందికి కొకైన్‌ విక్రయం 
పోలీసుల విచారణలో కేపీ చౌదరి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్‌ విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్‌ రోషన్, నల్లా రతన్‌ రెడ్డి, ఠాగోర్‌ విజ్‌ అలియాస్‌ ఠాగోర్‌ ప్రసాద్‌ మోటూరి, తేజ్‌ చౌదరి అలియాస్‌ రఘు తేజ, వంటేరు శవన్‌ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్‌ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్‌లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్‌ చేశారు. 

వందలాది ఫోన్‌ కాల్స్‌.. 
ఈ ఏడాది మేలో కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్‌ పార్టీ నిర్వహించాడు. ఈ సమయంలో సురేష్‌ రాజు, రతన్‌ రెడ్డి, గోవాలోని మీరాజ్‌ క్లబ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్‌ సుధీర్‌లతో కేపీ చౌదరి వందలాది ఫోన్‌ కాల్స్‌ మా­ట్లాడి­నట్లు గుర్తించారు. పెద్దసంఖ్యలో ఫోన్‌కాల్స్‌ ఎందుకు చేశారని చౌదరిని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. 

ఇతర రాష్ట్రాల్లోనూ డ్రగ్స్‌ కస్టమర్లు.. 
పలు ఇతర రాష్ట్రాలలో కూడా చౌదరికి డ్రగ్స్‌ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు. వీటిపైనా సరైన వివరణ ఇవ్వలేదు. అమెరికాలో ఉంటున్న దుగ్గిరాల అమర్‌ రూ.లక్షల్లో, గోవాలో రెస్టారెంట్‌ నిర్వాహకుడు మనీష్‌ సాహా రూ.85 వేలు, షేక్‌ ఖాజా అనే వ్యక్తి రూ.2 లక్షలు, బిహార్‌కు చెందిన కిన్‌షుక్‌ అగర్వాల్‌ రూ.16 వేలు, టి.సుజాత అనే మహిళ రూ.లక్ష నగదును కేపీ చౌదరి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వివరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement