టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య ఇవాళ (జూన్ 13) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఇంతకీ ఎం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి తంజిద్ హసన్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. డచ్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో బంతి తంజిద్ హెల్మెట్ గ్రిల్‌లో ఇరుక్కుపోయింది.
ఒకవేళ బంతి ఇంకాస్తా వేగంగా వచ్చి ఉంటే హెల్మెట్ గ్రిల్ లోనుంచి దూసుకుపోయి తంజిద్ కంటికి పెద్ద గాయం చేసేది. ఊహించని ఈ ఘటనలో తంజిద్ షాక్‌కు గురయ్యాడు. కొద్ది సేపటి వరకు అతనికి ఏమీ అర్దం కాలేదు. బంతి కంటి దగ్గరకు రావడంతో కళ్లు మూసుకున్న తంజిద్, కొద్ది సేపటి తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి అంగులాల దూరంలో బంతి ఉంది. షాక్ నుంచి తేరుకున్న తంజిద్ వెంటనే హెల్మెట్ తీసి నేలపై పెట్టాడు. ఫిజియో హుటాహుటిన మైదానంలోకి వచ్చి తంజిత్‌కు ఫస్ట్ ఎయిడ్ అందించాడు.
కాగా, ఈ ఘటన తర్వాత మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన తంజిద్ 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి ముందు ఆర్యన్ దత్ (2 వికెట్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తంజిద్.. షకీబ్ సాయంతో బంగ్లా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 17.2 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 130/4గా ఉంది. షకీబ్ (50), మహ్మదుల్లా (25) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాంటో (1), లిటన్ దాస్ (1), తౌహిద్ హ్రిదోయ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. డచ్ బౌలర్లలో వివియర్ కింగ్మా 2, పాల్ వాన్ మీకెరెన్, టిమ్ ప్రింగిల్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment