టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య నిన్న (జూన్ 10) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్ జాకెర్ అలీ కోపంతో బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జాకెర్ అలీ ఈ పనికి పాల్పడ్డాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడే క్రమంలో జాకెర్ అలీ బ్యాట్ డ్యామేజ్ అయ్యింది.
షాట్ మిస్ టైమ్ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్ స్వల్పంగా డ్యామేజ్ అయిన బ్యాట్‌ను రెండుగా చీల్చాడు. అనంతరం జాకెర్ కొత్త బ్యాట్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి బంగ్లాదేశ్.. చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కేశవ్ మహారాజ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు.
ఈ రెండు వికెట్లకు సంబంధించిన క్యాచ్‌లను కెప్టెన్ మార్క్రమ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సౌతాఫ్రికా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్‌ను ఢిఫెండ్ చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలరల్లో తంజిమ్ సకీబ్ 3, తస్కిన్ అహ్మద్ 2. రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. కేశవ్ మహారాజ్ (4-0-27-3), నోర్జే (4-0-17-2), రబాడ (4-0-19-2) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హ్రిదోయ్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాంటో (14), మహ్మదుల్లా (20) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment