ఐదుగురు రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలు | Sakshi
Sakshi News home page

ఐదుగురు రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలు

Published Sun, Aug 13 2023 1:15 AM

Center announces awards to 140 police officers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: అత్యుత్తమ నేర పరిశోధన చేసిన 140 మంది పోలీసు అధికారులను 2023 సంవత్సరానికి కేంద్ర హోంమంత్రి పతకానికి ఎంపిక చేశారు. నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఈ పతకాలను 2018 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు.

ఇందులో తెలంగాణ నుంచి ఎస్‌ఐబీ అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్న, బోధన్‌ ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ రాజుల సత్యనారాయణరాజు, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ యం.జితేందర్‌రెడ్డి, ఏసీపీ భూపతి శ్రీనివాసరావు పురస్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సీఐ అశోక్‌ కుమార్‌ గుంట్రెడ్డి, సీఐ మన్సూరుద్దీన్‌ షేక్, డీఎస్పీ ధనుంజయుడు మల్లెల, ఏఎస్పీ సుప్రజ కోర్లకుంట, డీఎస్పీ రవిచంద్ర ఉప్పుటూరి అవార్డులు పొందారు. 


ఎనిమిది మందికి జీవితఖైదు – అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్న
ప్రస్తుతం ఎస్‌ఐబీ అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న మేకల తిరుపతన్న.. 2016లో సంగారెడ్డి డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కంగ్టి పోలీస్‌ స్టేషన్‌లో ఓ గిరిజనుడి హత్యకేసు దర్యాప్తులో కీలకంగా పనిచేశారు. పక్కా సాక్ష్యాధారాలతో చార్జిషీట్‌ నమోదు చేయడంతో ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులు దోషులుగా తేలారు. వారికి గత ఫిబ్రవరిలో జీవిత ఖైదు విధించారు.  


హత్యాచారం కేసులో దర్యాప్తునకు.. – ఏసీపీ మూల జితేందర్‌ రెడ్డి
వరంగల్‌ పోలీస్‌ కమిషన రేట్‌లో ప్రస్తుతం ఎస్‌బీ ఏసీ పీగా విధులు నిర్వర్తి స్తున్న యం.జితేందర్‌రెడ్డి హనుమకొండ ఏసీపీగా పనిచేసే సమయంలో ఓ కేసు దర్యాప్తునకు అవార్డు దక్కింది. 2020 జనవరిలో హనుమకొండ రాంనగర్‌లో ఓ యువతిపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కేసులో దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నిందితుడుకి యావజ్జీవ శిక్ష పడింది.


ఆరేళ్ల పాపపై హత్యాచార కేసులో దర్యాప్తునకు... – డీఎస్పీ కె.ఎం.కిరణ్‌కుమార్, ఏసీపీ బోధన్‌
ప్రస్తుతం బోధన్‌ ఏసీపీగా పని చే స్తున్న కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్‌కుమార్‌ భూపాలపల్లి డీ ఎస్పీగా పని చేస్తున్నప్పుడు 2017 నవంబర్‌లో రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల దళిత పాపపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసిన కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు కటకం శివను 3 రోజుల్లోనే గుర్తించి 6 నెలల్లో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కటకం శివకు యావజ్జీక శిక్ష పడింది.


అనాథ బాలిక కేసులో... – డీఎస్పీ సత్యనారాయణరాజు
అమీన్‌పూర్‌లో అనాథ బాలికపై నెలలపాటు లైంగిక దాడి చేయడం, ఆమె మృతికి కారణమైన కేసు దర్యాప్తును నారాయణ ఖేడ్‌ డీఎస్పీగా పని చేస్తున్న రాజుల సత్యనారాయణరాజుకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించడంతో ఈ కేసులో ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. 

Advertisement
Advertisement