‘గృహ ప్రవేశం’ ఎన్నికల తర్వాతే  | Sakshi
Sakshi News home page

‘గృహ ప్రవేశం’ ఎన్నికల తర్వాతే 

Published Thu, Jul 27 2023 2:30 AM

Hyderabad real estate sector is slow down - Sakshi

ఎడతెరిపిలేని వర్షాలు, ఎన్నికల వాతావరణం, వడ్డీ రేట్ల ప్రభావం, ఐటీ ఉద్యోగుల లే–ఆఫ్‌లు, డిమాండ్‌–సరఫరా మధ్య వ్యత్యాసం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కారణాలేవైనా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం మందగమనంలోకి జారిపోయింది. అపార్ట్‌మెంట్లే కాదు ఓపెన్‌ ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఆఫీసు స్పేస్‌ అన్ని లావాదేవీల్లోనూ ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి– మార్చి మధ్యకాలం (క్యూ1)తో పోలిస్తే ఏప్రిల్‌–జూన్‌ (క్యూ2) నాటికి అన్ని విభాగాల విక్రయాల్లోనూ తగ్గుదల నమోదయింది.  –సాక్షి, హైదరాబాద్‌

కరోనా తర్వాత రెండేళ్లూ ఓకే..
కరోనా తర్వాత రెండేళ్ల పాటు స్థిరాస్తి రంగం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మార్కెట్‌ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ప్రతి సార్వత్రిక ఎన్నికలకు 6–8 నెలల ముందు నుంచే స్థిరాస్తి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కో­వడం సహజం.

ఏ ప్రభుత్వం వస్తుందో? కొత్త ప్రభు­త్వం వస్తే గత ప్రభుత్వ అభివృద్ధి పనులను కొనసాగిస్తుందో లేదో, పాత ప్రభు త్వమే వస్తే మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వెంటాడుతుంటాయి. ఇటీవల డెవలç­³ర్లు అనూహ్యంగా అపార్ట్‌మెంట్ల ధరల­ను పెంచేశారు. ఫలితంగా సామా­న్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు. రూ.50 లక్షల లోపు ధర ఉండే మధ్యతరగతి గృహాలు విక్రయాలు లేక చాలావరకు ఖాళీగా ఉన్నాయి. 

గృహ విక్రయాలలో తగ్గుదల..
హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ల సరఫరా, విక్ర­యాలు రెండింట్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది క్యూ2లో హైదరాబాద్‌లో 10,470 గృహాలు ప్రారంభమయ్యాయి. అదే క్యూ1లో చూస్తే 14,620 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 నెలల వ్యవధిలో గృహ సరఫరాలో 28 శాతం తగ్గుదల నమోదయ్యిందన్న మాట. ఇక విక్రయా­లు చూస్తే.. క్యూ1లో 14,280 ఇళ్లు అమ్ము­డుపోగా.. క్యూ2లో 13,570 యూనిట్లకు పడిపో­యాయి. అంటే 5 శాతం తగ్గాయని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.

ఆఫీసు స్పేస్‌లోనూ క్షీణతే..
నివాస సముదాయాల్లోనే కాదు ఆఫీసు స్పేస్‌ లావాదేవీల్లోనూ తగ్గుదల నమోద­యింది. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్‌లో 24 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాల లీజు లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 23 లక్షల చ.అ.కు పడిపోయాయి. అంటే 3 నెలల్లో 4 శాతం క్షీణత చోటు చేసుకుందన్న మాట. దేశీయ, బహుళ జాతి కంపెనీల విస్తరణ నిర్ణయాల్లో  జాప్యం, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు క్షీణతకు ప్రధాన కారణమని రియల్టీ కన్సల్టెన్సీ వెస్టియన్‌ సీఈఓ శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌లో 1.39 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. 

వ్యవసాయ భూముల  రిజిస్ట్రేషన్లూ అంతే..
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 1.47 లక్షల వ్యవసాయ భూముల రిజిస్ట్రే­షన్లు, మ్యుటేషన్ల దరఖా­స్తులు వచ్చాయని ధరణి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పార్టిషన్, సక్సెషన్, నాలా కింద వచ్చిన దరఖాస్తులే 40 వేల వరకుంటాయి. అంటే లక్ష డాక్యు­మెంట్లు మాత్రమే క్రయవిక్రయాలకు సంబంధించి జరిగాయి. అదే గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పార్టిషన్, సక్సెషన్, నాలా మినహాయిస్తే.. 1.51 లక్షల డాక్యు­మెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే 50 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయన్న మాట.

ఎన్నికల తర్వాతే మార్కెట్‌కు ఊపు
హైదరాబాద్‌లో మధ్య­తరగతి గృహాల మార్కెట్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికల వాతావ­రణంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. కాబట్టి 3–6 నెలలు మార్కెట్‌ ప్రతికూలంగానే ఉంటుంది. ఎన్నికల తర్వాతే స్థిరాస్తి మార్కెట్‌జోరందుకుంటుంది.    – టీవీ నర్సింహారెడ్డి, స్పేస్‌విజన్‌ గ్రూప్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement