అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘింస్తూ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీచర్లకు చార్జ్ మెమోలు జారీ చేసి వారిచ్చే వివరణ బట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయంగా విద్యాశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ ప్రాథమిక పాఠశాల టీచరు రాఘవేంద్రగుప్తా, నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల టీచరు వై.మంజునాథ్ ఇద్దరూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఆ సమయంలో వీరికి బ్రహ్మసముద్రం మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఓబుళపతి మండలంలోని ఇతర టీచర్ల పోస్టల్ బ్యాలెట్ ఆర్డర్లను అందజేశారు. ఈ ఆర్డర్ కాపీలు తమవద్ద అందుబాటులో ఉన్నట్లు సదరు టీచర్లు వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్‌లు పెట్టారు. వీరి వ్యవహారంపై ‘సి’ విజిల్ యాప్ ద్వారా ఆధారాలతో సహ ఎన్నికల కమిషన్‌కు, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి వరకూ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం చార్జ్‌మెమోలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అలాగే బ్రహ్మసముద్రం ఎంఈఓపై చర్యలకు ఆర్జేడీకి సిఫార్సు చేశామని చెబుతున్నా... ఆర్జేడీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం.
ఈ ఇద్దరికంటే ఆ టీచరు పెద్ద తప్పు చేశాడా?
వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేశారు. ఆయన చేసిన నేరం ఏంటంటే...‘పదో తరగతి పరీక్షల నిర్వహణ, కోడింగ్ పనులు, స్పాట్ వాల్యూయేషన్ సిబ్బంది రెమ్యూనరేషన్‌ను ప్రభుత్వం గతేడాది పెంచిందని ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై మార్చి 23న ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై ఆయనకు ఎలాంటి నోటీసులు, చార్జ్ మెమోలు ఇవ్వకుండా ఏకంగా సస్పెండ్ చేశారు.
అయితే టీడీపీకి కార్యకర్తల్లా పనిచేసిన ఇద్దరు టీచర్లపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ‘పచ్చ’పాత ధోరణిపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా అశోక్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటనలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment