వైఎస్‌ఆర్ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు
సర్పంచ్‌గా పులివెందుల గ్రామాభివృద్ధికి కృషి
నేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి
నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబీకులు
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేదలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచే వారు. కరవు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు వైఎస్.రాజారెడ్డి జన్మించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నత స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర ఎనలేనిది.
పులివెందుల గ్రామ సర్పంచ్‌గా
రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి పులివెందులలో వైఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్యనైనా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల సర్పంచుగా తన ప్రజాప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు ఆయన పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పులివెందులలో వీధి దీపాలు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు.
అప్పట్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సమస్య పరిష్కరించారు. గ్రామ సమస్యలపై పోరాడుతూనే మరో వైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రజలకు నేడు జనరంజక పాలన అందడానికి, పేదల పట్టెడు అన్నం, గూడు, బట్టలు కట్టడమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న పెద్దాయన కుమారుడు దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కృషి ఉంది. నేటికీ అక్కడక్కడా పెద్దాయన పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.
ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం
పులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో వైఎస్.రాజారెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన బ్రతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన పెద్దాయన. ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలవబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. అంతేగాక ఆయన తనయుడు దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. పెద్దాయన పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలు, రాజకీయాలను అన్నీ తానై చూసుకొనేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్‌ఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.
విద్యా ప్రదాతగా
దివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్‌లు చూపిన బాటలోనే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికీ పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.
నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబసభ్యులు
నేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా గురువారం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి పార్కులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం జీసెస్ చారిటీస్‌లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment