అధికారి ధిక్కారం..టెండర్‌ ‘అప్రూవ్‌’ ఆలస్యం | Sakshi
Sakshi News home page

అధికారి ధిక్కారం..టెండర్‌ ‘అప్రూవ్‌’ ఆలస్యం

Published Fri, Aug 25 2023 2:06 AM

Negligence in Civil Supplies Corporation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్‌ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్‌ ఈ– టెండర్‌ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో బిడ్స్‌ ఆహ్వానించారు. సెపె్టంబర్‌ 5వ తేదీని బిడ్డింగ్‌కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్‌ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్‌లైన్‌లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్‌లైన్‌లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్‌ వివరాలను అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్‌లైన్‌ డిజిటల్‌ కీ మార్కెటింగ్‌ సెక్షన్‌ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్‌ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్‌ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్‌ చేసి, గ్లోబల్‌ టెండర్‌లకు సంబంధించిన విధి విధానాలను అప్‌లోడ్, అప్రూవ్‌ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్‌ సెక్షన్‌ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్‌ కీతో అప్‌లోడ్‌ చేశారు. కానీ పీడీఎస్‌ డీజీఎంగా ఉన్న అధికారి, అప్‌లోడ్‌ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్‌ చేయాల్సి ఉండగా, లాగిన్‌ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం.

స్వయంగా సంస్థ ఎండీ ఫోన్‌ చేసి డిజిటల్‌ కీతో టెండర్‌ ప్రక్రియను అప్రూవ్‌ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్‌ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్‌లోడ్‌ చేయలేకపోయారు.

గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్‌ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్‌ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్‌లోడ్‌ చేశారు.  

బదిలీ చేశారనే కోపంతో..? 
పీడీఎస్‌ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్‌ ఆఫీస్‌ నుంచి వికారాబాద్‌కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్‌ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు.

ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్‌ విధి విధానాలను అప్రూవ్‌ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement