మొహెంజోదారోలో జరిపిన తవ్వకాల్లో రెండు అద్భుతమైన శిల్పాలు బయట పడ్డాయి.అందులో ఒకటి నాటి పాలకుడిదిగా భావించారు. ఇది కేవలం ఆరు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. నగరానికి మత పెద్దగా పూజారిగా ఉన్న వ్యక్తే మొహెంజోదారోను పాలించి ఉండచ్చని శిల్పం ఆకృతి వేషధారణ లక్షణాల ఆధారంగా నిర్ధారించారు. అందుకే ఆ శిల్పాన్ని కింగ్ ప్రీస్ట్ విగ్రహంగా పేర్కొన్నారు. దాంతో పాటు ఓ యువతి నృత్యం చేసే భంగిమలో ఉన్న శిల్పం కూడా బయట పడింది. దాన్ని డ్యాన్సింగ్ గర్ల్ విగ్రహంగా వర్ణించారు.
మొహెంజోదాదోలో నృత్యకళ వైభవోపేతంగా ఆదరణకు నోచుకుందని ఈ విగ్రహం చెబుతోంది.1925 తవ్వకాల్లో బయట పడ్డ ఈ రెండు శిల్పాలను ఢిల్లీలో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో ఉంచారు.
దేశ విభజన జరిగిన 23 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో 1970లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని కలిసి మొహెంజోదారోలో బయటపడ్డ కింగ్ ప్రీస్ట్, డ్యాన్సింగ్ గాళ్ శిల్పాలను తమకు ఇవ్వాల్సిందిగా అభ్యర్ధించారు.ఎందుకంటే మొహెంజోదారో ఉన్న ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలో ఉంది.
అయితే ఇందిరా గాంధీ రెండు విగ్రహాలూ ఇవ్వడానికి అంగీకరించలేదు. కింగ్ ప్రీస్ట్ విగ్రహాన్ని పాకిస్థాన్ కు అందించిన ఇందిరా గాంధీ డ్యాన్సింగ్ గాళ్ విగ్రహాన్ని మాత్రం భారత్ లోనే ఉంచుకుంటామన్నారు.కింగ్ ప్రీస్ట్ విగ్రహం ప్రస్తుతం కరాచీ మ్యూజియంలో భద్రంగా ఉంచారు.
మొహెంజోదారో ప్రజలు చాలా ప్రతిభావంతులు. చాలా రంగాల్లో నిష్ణాతులు. ఎన్నో నైపుణ్యాలు ఉన్న ప్రజ్ఞావంతులు. అప్పట్లో వారి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. గోధుమలు, బార్లీ ప్రధాన పంటలుగా సాగు చేసేవారు.అరటి , కర్బూజా, పచ్చిబఠానీలు కూడా పండించేవారు.
వీటితో పాటు వాణిజ్య పంటగా పత్తిని పెద్ద ఎత్తున సాగు చేసేవారు.7వేల సంవత్సరాల క్రితమే పత్తిని సాగుచేసి బట్టలు ఉడికిన నైపుణ్యం మొహెంజోదారో ప్రజల సొంతం. అప్పట్లో మొహెంజోదారోతో పోటీ పడిన ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలు వర్ధిల్లిన చోట పత్తి సాగు లేదు. అది కేవలం సింధూ లోయకే పరిమితం కావడం విశేషం.
వెండి,రాగి పాత్రలు తయారు చేసేవారు. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే ఇటుకలను బ్రహ్మాండంగా తయారు చేసేవారు. మొదట్లో మట్టితో చేసిన ఇటుకలను ఎండలో ఎండబెట్టి వాటినే వాడే వారు. ఆ తర్వాత పచ్చి ఇటుకలను కొలిమిలో కాల్చి తయారు చేయడం మొదలు పెట్టారు.ఈ ఆవిష్కరణ కూడా వీరి సొంతమనే చెప్పాలి.ఇటుకలన్నీ ఒకే సైజులో ఒకే నాణ్యతతో కలకాలం మన్నిక ఉండేలా తయారు చేశారు. స్పాట్ డ్రెసింగ్ టేబుల్స్ అయితే లేవు కానీ. మొహాన్ని అద్దంలో చూసి అలంకరించుకోడానికి ఇసుకతో అద్దాన్ని తయారు చేయడం మాత్రం నేర్చుకున్నారు. అద్దాలతో పాటు చెక్కతో దువ్వెనలూ తయారు చేశారు. కాటుక నిల్వచేసుకునే సీసాలా ఉండే భరణి కూడా తయారు చేశారు.
రక రకాల పూసలు, లోహాలతో ఆభరణాలు తయారు చేశారు. బట్టలు కుట్టుకునే సూదిని ఆవిష్కరించారు. గొడ్డలికి పురుడు పోసింది కూడా ఈ కాలంలోనే. వీరు డిజైన్ చేసిన గొడ్డలి రకాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నాం.
చేపలను పట్టుకోడానికి అవసరమైన గేలాన్ని తయారు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు రూపొందించారు. బంతులు, బొంగరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.వీరు తయారు చేసిన వస్తువులు విక్రయించేటపుడు వాటిపై వేసేందుకు రక రకాల ముద్రలు తయారు చేశారు. జంతువుల బొమ్మలతో వాటిని రూపొందించారు.
మసాలాలు నూరే పొత్రం, రాయి, తిరగలి వంటివి తయారు చేశారు. రంగు రంగుల డిజైన్లు వేసిన కుండలు తయారు చేశారు. బాత్ టబ్స్ అప్పుడే రూపొందించారు ఈ మేథావులు.
వర్తకాల్లో కొలమానాలను బరువులు తూచే సాధనాలనూ తయారు చేసుకున్నారు. కనీస బరువు 0.856 గ్రాములు తూగే రాయి ఉండేది. ఎక్కువగా వాడే రాయి బరువు 13.7 గ్రామాలు ఉండేది. అంటే కనీస బరువుకు సరిగ్గా 16 రెట్లు బరువైనది.
హరప్పా లో వాడిన ముద్రలకు సింధూ నాగరికతలో బయట పడ్డ ముద్రలకు పోలికలు ఉన్నాయి. ఇలాంటివే ఈజిప్ట్, మెసొపొటేమియాల్లోనూ కనిపించాయి.హరప్పా నుండి మొహెంజోదారో మీదుగా 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెసొపొటేమియా వరకు వాణిజ్య లావాదేవీలు, సరుకుల ఎగుమతి దిగుమతులు జరిగినట్లు ఆధారాలు దొరికాయి.
ఇక్కడ మాత్రమే దొరికే వింత రంగుల కార్నేలియన్ రాళ్లు, కలప, ఏనుగు దంతాలను మెసొపొటేమియాకు ఎగుమతి చేసేవారు.ఈ కార్నేలియన్ రాయి ఇప్పటికీ గుజరాత్ లో విస్తారంగా దొరుకుతుంది. అక్కడి నుండే ఇప్పటికీ అరబ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అలాగే ఆసియాలో ఉండే మొత్తం ఏనుగుల్లో 60 శాతం ఏనుగులు భారత్ లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఏనుగు దంతాలు భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి.
మెసొపొటేమియాను పాలించిన అకాడియన్ సామ్రాజ్య చక్రవర్తి సారగాన్ భారీ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలో అలంకారాల కోసం కార్నేలియన్ రాయి, ఏనుగు దంతాలు, కలపలను మెలుహా నుండి ఓడల్లో దిగుమతి చేసుకునేవారు. మొహెంజోదారోనే మెసొపొటేమియన్లు మెలుహాగా పిలుచుకునేవారు.
ఇరాన్ ఇరాక్ లకు ఇక్కడి నుండి సరుకులు ఎగుమతి అయ్యేవి. పర్షియన్ గల్ఫ్ మీదుగా జలరవాణా మార్గంలోనూ ఎగుమతి దిగుమతులు జరిగేవి. స్పాట్ ఇంగ్లీషులో 26 అక్షరాలుంటే హిందీలో 46, ఉర్దూలో 39 అక్షరాలు తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. సింధూ లోయ నాగరికత లో సింధూ భాషకు ఏకంగా 419 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇవి రక రకాల బొమ్మలు,చిహ్నాలతో నిండి ఉన్నాయి. సింధూ బాషను ఈ రోజుకీ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. చాలా సంక్లిష్టమైనది ఈ భాష.
మొహెంజోదారోలో అద్భుతమైన బౌద్ధ స్థూపం కూడా ఒకటి ఉంది. ఇందులో ఒక పాత్ర ఉంది. అందులో గౌతమ బుద్ధుని అస్థికల బూడిద ఉందని అంటారు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందినపుడు ఆయన పార్ధివ దేహం కోసం వివిధ వర్గాల భక్తులు పోటీ పడ్డారట. దాంతో బుద్ధుని దేహాన్ని ఖననం చేసి ఆ బూడిదను, అస్థికలను అందరికీ సమానంగా పంచారట. అలా తమ వాటాగా వచ్చిన బూడిదను భక్తులు ఒక పాత్రలో వేసి బౌద్ధ స్థూపాల్లో ఉంచి అక్కడే ప్రార్దనలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అంటారు. అటువంటిది ఒకటి మొహెంజోదారోలో ఉంది.
మొహెంజోదారో ప్రజల్లో ఎవరైనా చనిపోయినపుడు మూడు రకాలుగా అంత్యక్రియలు చేసేవారు. కొందరు ఖననం చేసేవారు. మరి కొందరు దహనం చేసేవారు. ఇంకొందరు ఈజిప్ట్ లో ఫారోల మాదిరిగా మృతదేహంతో పాటు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్ధాలు, తేనె, ఆభరణాలు వంటివి పక్కనే ఉంచేవారట.
చనిపోయిన మనుషులు తిరిగి బతికే అవకాశం ఉందని వీరు నమ్మేవారు. ఈ నమ్మకం ఈజిప్టు లోనూ ఉండేది. అలా బతికిన వారికి ఆకలి వేస్తే అవసరం అవుతుందనే ఆహార పదార్ధాలతో వాటిని పిరమిడ్లలో ఉంచేవారు ఈజిప్షియన్లు.
రక రకాల వ్యాపారాలు చేశారు. ఎన్నో కళారూపాలు ఆవిష్కరించారు. సరికొత్త ఆవిష్కరణలు చేశారు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కారు. ఇంజనీరింగ్ లో తమకి తామే సాటి అని నిరూపించుకున్నారు. నగరంలో అందరూ కలిసి మెలిసి జీవించేవారు.అంతా ఆనందంగా వైభోగంగానే సాగిపోయింది. అయితే కాల క్రమంలో సింధూ నదిలో నీళ్లు తగ్గిపోయాయి. నీటికి కట కట వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు ఈ ప్రాంతంపై దండయాత్రలకు దిగారు. ప్రకృతి వైపరీత్యాలు వేధించాయి.
పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు లేకపోవడం తో మొహెంజోదారో ప్రజలు తమ అద్భుత నగరాన్ని అయిష్టంగానే వీడి పొట్ట చేత పట్టుకుని వలసలు పోయారు. వారంతా తూర్పు వైపు వెళ్లిపోయారు. ఈ నగరం కాల క్రమంలో కాల గర్భంలో కలిసిపోయింది. తనతో పాటు ఎన్నో జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకుంది. మౌనంగా భూగర్బంలో ఉండిపోయింది. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలతో గత వైభవ చిహ్నం మనల్ని పలకరించింది. ఇప్పటికీ ప్రపంచమంతా మొహెంజోదారో వైభవానికి సలామ్ చేస్తారందుకే.
Comments
Please login to add a commentAdd a comment