ఆ సినిమాపై క్షమాపణ చెప్పాలి: పాక్ మంత్రి
ప్రాచీన సింధు నాగరికత నేపథ్యంగా తెరకెక్కిన 'మొహెంజోదారో' సినిమాపై పాకిస్థాన్ లోని సింధు ప్రాంత సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి సర్దార్ అలీ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. హృతిక్ రోషన్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. ఇందుకుగాను చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేవారు.
ఐదువేల ఏళ్ల కిందట నాటి అత్యున్నత సాంస్కృతిక నాగరికత అయిన సింధు నాగరికతను అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని డాన్ పత్రికతో షా పేర్నొన్నారు. ఈ విషయంలో సింధు ప్రజల అభ్యంతరాలు, ఆందోళనను చిత్ర దర్శకుడికి తెలియజేస్తానని ఆయన చెప్పారు. ఈ సినిమా నిండా దర్శకుడి కల్పిత ఊహలు మాత్రమే ఉన్నాయని, మొహెంజోదారో చరిత్రతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంతో సంపన్నమైన నాగరికతగా సింధు చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా పేరున్నదని, అందుకే మొహెంజోదారో ప్రాంతాన్ని యునెస్కో సైతం చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించిందని ఆయన అన్నారు. వందకోట్ల బడ్జెట్ తో భారీ అంచనాలతో రూపొందిన 'మోహెంజోదారో' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోని విషయం తెలిసిందే.