ఎదురులేని 'రుస్తుం'.. భారీ కలెక్షన్లు!
అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్లు పెరిగిపోతుండగా దీనికి పోటీగా వచ్చిన హృతిక్ రోషన్ 'మొహెంజోదారో' మాత్రం చతికిలపడుతోంది.
నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'రుస్తుం' పట్ల రివ్యూలు పెద్దగా ఆకర్షణీయంగా రాకపోయినా మౌత్ టాక్ మాత్రం బాగా కలిసివస్తున్నదట. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రెండురోజుల్లోనే రూ. 30.54 కోట్లను కొల్లగొట్టింది. ఆదివారం కూడా ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశముందని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సెలవు ఉండటం ఈ సినిమాకు కలిసివస్తుందని, మొత్తంగా తొలి వీకెండ్ లోనే దేశీయంగా రూ. 60 కోట్లకుపైగా 'రుస్తుం' సాధించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో తొలి వీకెండ్ లో ఓవరాల్ గా రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. 'రుస్తుం' సూపర్ హిట్ గా నిలిచే అవకాశముందని ట్రేడ్ పరిశీలకులు చెప్తున్నారు. పటిష్టమైన కథనం, అక్షయ్ కుమార్ పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్లస్ గా మారాయని వారు అంటున్నారు. తొలిరోజు 'రుస్తుం' రూ. 14.11 కోట్లు వసూలు చేయగా, రెండోరోజు 16.43 కోట్లు రాబట్టింది. ఆదివారం రూ. 14 నుంచి18 కోట్లు రాబట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా రూ. 8 కోట్లకుపైగా రాబట్టింది.
చతికిలపడ్డ హృతిక్ సినిమా!
సింధులోయ చారిత్రక కథతో, భారీ బడ్జెట్, అట్టహాసంతో విడుదలైన హృతిక్ రోషన్ 'మోహెంజోదారో' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా రెండురోజుల్లో రూ. 18.3 కోట్లు మాత్రమే రాబట్టింది. 'రుస్తుం' కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదలైన 'మొహెంజోదారో' తొలిరోజు రూ. 8.8 కోట్లు, రెండోరోజు రూ. 9.5 కోట్లు రాబట్టింది.