సీనియర్ హీరో సినిమాకు జూనియర్ ఝలక్!
ఈ నెల 12న బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్‌కు తెరలేవబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అక్షయ్‌కుమార్ 'రుస్తుం', హృతిక్ రోషన్ 'మొహెంజోదారో' సినిమాలు ఒకేసారి 12న విడుదలకాబోతున్నాయి. ఇండిపెండెన్స్ డే రేసులో సత్తా చాటేందుకు ఈ రెండు సినిమాలు పోటీపడుతుండటంతో సహజంగా బాలీవుడ్ దృష్టి ఈ బిగ్ సినిమాలపైనే ఉంది.
అక్షయ్, ఇలియాన, ఈషా గుప్తా జంటగా తెరకెక్కిన 'రుస్తుం' సినిమా.. 'మొహెంజోదారో'తో పోలిస్తే చిన్న సినిమా అనే చెప్పాలి. 'రుస్తుం' రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. అంతకు రెట్టింపు బడ్జెట్‌తో ప్రాచీన సింధు నాగరికత నేపథ్యంతో హృతిక్ రోషన్, పుజా హెగ్డేల 'మొహెంజోదారో' వస్తున్నది.
కానీ, బాక్సాఫీస్ పరంగా చూస్తే సీనియర్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ మంచి కథ-తక్కువ బడ్జెట్ కాంబినేషన్‌తో భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఎయిర్‌లిఫ్ట్, బేబీలాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇక రెండేళ్ల కిందట వచ్చిన 'బ్యాంగ్ బ్యాంగ్' తర్వాత హృతిక్ వెండితెరపై కనిపించలేదు. కాబట్టి హృతిక్ ఇది కామ్‌బ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో సహజంగానే హృతిక్ 'మొహెంజోదారో' సినిమా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ అండగా ఉండటంతో దాదాపు 2,300 నుంచి 2,500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఇక అక్షయ్ సినిమా దాదాపు రెండువేల థియేటర్లకే పరిమితం కానుంది.
బాలీవుడ్‌లో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్ల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో షారుఖ్‌ఖాన్ 'దిల్‌వాలే', రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొనే 'బాజీరావు మస్తానీ' ఒకేరోజు విడుదలయ్యాయి. అయితే, 'బాజీరావు' ఆడినంతగా 'దిల్‌వాలే' ఆకట్టుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', షారుఖ్ 'రాయిస్' ఒకేరోజున వస్తాయని భావించినప్పటికీ ఈ రేసు నుంచి షారుఖ్ తప్పుకోగా.. 'సుల్తాన్' తన దూకుడు చాటిన సంగతి తెలిసిందే.