ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ నేటి నుంచి ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ నేటి నుంచి ప్రారంభం.. అమితాబ్‌, అక్షయ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌

Published Wed, Mar 6 2024 3:53 PM

Indian Street Premier League Starts From March 6th, With Amitabh Bachchan VS Akshay Kumar Match - Sakshi

ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌) తొలి ఎడిషన్‌ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్‌ లీగ్‌ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్‌ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్‌ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. 

జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు..
ఐఎస్‌పీఎల్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును కొనుగోలు చేయగా..

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మఝీ ముంబైను.. అక్షయ్‌ కుమార్‌ శ్రీనగర్‌ వీర్‌ను.. హృతిక్‌ రోషన్‌ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్‌ అలీ ఖాన్‌-కరీనా కపూర్‌ టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కతాను.. తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య చెన్నై సింగమ్స్‌ జట్లను కొనుగోలు చేశారు. 

చీఫ్‌ మెంటార్‌గా రవిశాస్త్రి..
ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి చీఫ్‌ మెంటార్‌గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్‌ ఆమ్రే, జతిన్‌ పరంజపే సెలెక్షన్‌ కమిటీ హెడ్‌లుగా పని చేయనున్నారు. 

అమితాబ్‌ వర్సెస్‌ అక్షయ్‌..
ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో అమితాబ్‌ మఝీ ముంబై.. అక్షయ్‌ కుమార్‌ శ్రీనగర్‌ వీర్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ థానేలోని దాదోజీ కొండదేవ్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 2 టీవీ ఛానెల్‌లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్‌ యాప్‌లోనూ వీక్షించవచ్చు. 

సచిన్‌ జట్టుతో తలపడనున్న అక్షయ్‌ టీమ్‌..
ఇవాళ జరుగబోయే ఓపెనింగ్‌ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనుంది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవెన్‌ జట్టు..  అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలోని టీమ్‌ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ సాయంత్రం 5 గంటల​కు ప్రారంభమవుతుంది. 

Advertisement
Advertisement