Rustom
-
నా పెళ్లిలో ఈ నగలు బాగుంటాయి కానీ: హీరోయిన్
'నేను పెళ్లిచేసుకుంటే ఈ బంగారు అభరణాలు ధరించాలని కోరుకుంటాను.. కానీ నిజానికైతే నాకిప్పుడు పెళ్లి ఆలోచనలేదు. రిలేషన్షిప్ గోల్స్ నేను నమ్మను' అంటూ ట్విస్టు ఇచ్చింది బాలీవుడ్ భామ ఇషా గుప్తా. తాజాగా 'రుస్తుం' సినిమాతో పలుకరించిన ఈ బ్యూటీ ప్రముఖ నగల దుకాణం 'హజూరి లాల్ బై సందీప్ నారంగ్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా పెళ్లి అభరణాలు ధరించి మురిసిపోయిన ఈ అమ్మడు 'నీ పెళ్లి ఎప్పుడు' అంటే మాత్రం ఒకింత చిత్రమైన సమాధానమిచ్చింది. 'హాహా.. ఇప్పుడు పెళ్లి లేదూ. ఆ ముచ్చట లేదు. అసలు అనుబంధాల లక్ష్యాలను పెద్దగా విశ్వసించను. జస్ట్ కెరీర్ మీదనే ఇప్పుడు ఫోకస్ చేశాను' అని ఇషా గుప్తా బదులిచ్చింది. 'జన్నత్ 2' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఇషా .. ఆ తర్వాత 'రాజ్ 3డీ', 'హమ్షకల్', 'చక్రవ్యూహ్' వంటి సినిమాల్లో నటించింది. తాజాగా 'రుస్తుం'తో ప్రశంసలందుకున్న బ్యూటీ త్వరలో 'కమాండో 2', 'బాద్షాహో' చిత్రాలతో రానుంది. ఈ క్రమంలో పెళ్లి గురించి తాను అస్సలు ఆలోచించడం లేదని, ప్రస్తుతం తాను విభిన్నమైన పాత్రలు పోషిస్తుండటంతో కెరీర్ సంతృప్తిగా సాగుతోందని చెప్పారు. -
తన సినిమా హిట్ కాకున్నా..!
దాదాపు రెండేళ్ల తర్వాత 'మొహెంజోదారో' సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు హృతిక్ రోషన్. భారీ బడ్జెట్‌తో, చరిత్రాత్మక కథతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఫలితంతో హృత్తిక్ నిరాశ చెంది ఉండొచ్చు కానీ.. తన చిత్రానికి పోటీగా వచ్చిన 'రుస్తుం' సూపర్ హిట్ కావడం ఆయనకు ఈర్ష్య కలిగించలేదు సరికదా సంతోషాన్నిచ్చింది. అక్షయ్‌కుమార్ 'రుస్తుం', హృతిక్ 'మొహెంజోదారు' సినిమాలు ఒకేసారి పోటాపోటీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఓవైపు 'రుస్తుం' భారీ వసూళ్లతో వందకోట్ల దిశగా దూసుకెళుతుండగా.. 'మొహెంజోదారో' మాత్రం చతికిలపడింది. ఈ నేపథ్యంలో 'రుస్తుం' హిట్ పై అక్షయ్‌కుమార్ ఫుల్ హ్యాపీగా ఉండటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని హృతిక్ ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ విజయాన్ని తాను కూడా ఆస్వాదిస్తున్నానని, ఆనందంగా ఉండటం ఒక ప్రాక్టీస్ అని హృతిక్ పేర్కొన్నాడు. 'రుస్తుం' సినిమాను ఆదరిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ అక్షయ్‌కుమార్ ఒక వీడియో పెట్టాడు. ఆ ట్వీట్‌పై స్పందిస్తూ హృతిక్ తాను కూడా ఈ సినిమా విజయంపై హ్యాపీగా ఉన్నట్టు తెలిపాడు. సినీ పోటిని పక్కనబెడితే తమ మధ్య చక్కని స్నేహబంధం ఉన్నదంటూ చాటాడు. 'రుస్తుం' సినిమా దేశీయంగా రూ. 90 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. ఇప్పటికీ బాగా ఆడుతోంది. -
వరుసగా మూడో సినిమాకు 100 కోట్లు
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాంచి జోష్ మీదున్నాడు. ఈ ఏడాది విడుదలైన అక్షయ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్నాయి. వరుసగా మూడో సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరనుంది. అక్షయ్ నటించిన ఎయిర్ లిఫ్ట్, హౌస్‌ఫుల్ 3 సినిమాలు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించగా, తాజా చిత్రం రుస్తోం ఈ మార్క్‌కు చేరువైంది. శుక్రవారం నాటికి రుస్తోంకు 95.31 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. శనివారం కలెక్షన్లతో కలిపి వంద కోట్లు (భారత్‌లో నెట్) దాటవచ్చని అంచనా వేశాడు. ఇక ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు వచ్చాయి. నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ సరసన ఇలియానా నటించింది. -
సింధు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయ్!
రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది పీవీ సింధు. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ గా మారిపోయింది. ఆమెకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా మారుమోగనున్నాయి. కానీ ఆమె అందరిలాంటి సిటీ అమ్మాయే. బాలీవుడ్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం. అలాగే ఐస్ క్రీమ్ అన్నా, హైదరాబాదీ బిర్యానీ అన్నా మక్కువ. అందుకే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం సినిమాలు, బిర్యానీ ఎదురుచూస్తున్నాయి. 'రుస్తుం', 'మహెంజోదారో' వంటి కొత్త హిందీ సినిమాల గురించి సింధు నన్ను చాలాసార్లు అడిగింది. తను ఇక్కడి వచ్చాక ఐస్ క్రీమ్, బిర్యానీ తినాలనుకుంటోంది' అని సింధు తండ్రి పీవీ రమణ 'ఇండియా టుడే'కు తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో బయట వండిన ఆహారం సింధు తినకుండా తాము చర్యలు తీసుకున్నామని, ఆమె కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. -
హీరో డ్రెస్ విషయంలో ఇన్ని తప్పులా?
బాలీవుడ్ సినిమాలకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అది 'రుస్తుం' సినిమాతో మరోసారి బయటపడింది. 1959నాటి నావికాదళం అధికారి నానావతి కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వాస్తవిక ఘటనలకు చాలావరకు సినీ నాటకీయత జోడించడమే కాకుండా.. నేవీ యూనిఫామ్ విషయంలోనూ పెద్ద తప్పులే చేశారు. నిజ జీవిత సంఘటనలకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం కల్పిత కథ మాత్రమేనని సినిమా మొదలయ్యేటప్పుడు దర్శకనిర్మాతలు చెప్పుకొన్నా.. నేవీ యూనిఫామ్ విషయంలో మాత్రం తెలిసీతెలియని తప్పులు చాలా చేశారు. అసలు ఏమాత్రం అధ్యయనం చేయకుండా ఇష్టానుసారం ఈ సినిమాలో హీరో ధరించిన నేవీ డ్రెస్‌ను రూపొందించినట్టు కనిపిస్తోంది. సినిమాలో లీడ్ క్యారెక్టర్‌గా ఉన్న హీరో అక్షయ్ కుమార్ అస్తవ్యస్తంగా రూపొందించిన ఈ నేవీ డ్రెస్ వేసుకొని సినిమా తెరనిండా కనిపించడం పలువురు రక్షణరంగ నిపుణులను విస్మయపరిచింది. ఈ సినిమా కథ 1959నాటికి చెందింది. అయినా చిత్ర హీరో సీడీఆర్ రుస్తుం పవ్రీ ధరించిన నేవీ యూనిఫామ్‌పై అడ్డగోలుగా మెడల్స్ పెట్టేశారు. నేవీ యూనిఫామ్ భుజాల మీద ఉండే నెల్సన్ రింగ్‌ను తలకిందులుగా పెట్టారు. ఇక యూనిఫామ్ మీద పెట్టిన చాలా మెడల్స్ ఇటీవలకాలానికి చెందినవి. 1972 తర్వాత ప్రవేశపెట్టిన పలు మెడల్స్ తోపాటు 1999 కార్గిల్ యుద్ధం, 2001-02లో ప్రవేశపెట్టిన ఓపీ పరాక్రమ్ మెడల్ కూడా ఈ యూనిఫామ్ ఉండటం గమనార్హం. ఇక గడ్డం లేకుండా కేవలం మీసాన్ని కలిగి ఉండటం 1971 తర్వాతనే నేవీలో అనుమతించారు. నేవీ యూనిఫామ్, హీరో రూపరేఖల విషయంలో ఇలాంటి తప్పులు చాలా చేశారు. ఈ తప్పులను గుర్తిస్తూ ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సందీప్ ఉన్నిథాన్ పెట్టిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. నిజానికి బాలీవుడ్లో ఆర్మీ యూనిఫామ్ విషయంలో తప్పులు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో వచ్చిన చాలా సినిమాల్లోనూ ఇదే తరహా పొరపాట్లు చాలాచేశారు దర్శకనిర్మాతలు. -
ఎదురులేని 'రుస్తుం'.. భారీ కలెక్షన్లు!
అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్లు పెరిగిపోతుండగా దీనికి పోటీగా వచ్చిన హృతిక్ రోషన్ 'మొహెంజోదారో' మాత్రం చతికిలపడుతోంది. నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'రుస్తుం' పట్ల రివ్యూలు పెద్దగా ఆకర్షణీయంగా రాకపోయినా మౌత్ టాక్ మాత్రం బాగా కలిసివస్తున్నదట. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రెండురోజుల్లోనే రూ. 30.54 కోట్లను కొల్లగొట్టింది. ఆదివారం కూడా ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశముందని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సెలవు ఉండటం ఈ సినిమాకు కలిసివస్తుందని, మొత్తంగా తొలి వీకెండ్ లోనే దేశీయంగా రూ. 60 కోట్లకుపైగా 'రుస్తుం' సాధించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో తొలి వీకెండ్ లో ఓవరాల్ గా రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. 'రుస్తుం' సూపర్ హిట్ గా నిలిచే అవకాశముందని ట్రేడ్ పరిశీలకులు చెప్తున్నారు. పటిష్టమైన కథనం, అక్షయ్ కుమార్ పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్లస్ గా మారాయని వారు అంటున్నారు. తొలిరోజు 'రుస్తుం' రూ. 14.11 కోట్లు వసూలు చేయగా, రెండోరోజు 16.43 కోట్లు రాబట్టింది. ఆదివారం రూ. 14 నుంచి18 కోట్లు రాబట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా రూ. 8 కోట్లకుపైగా రాబట్టింది. చతికిలపడ్డ హృతిక్ సినిమా! సింధులోయ చారిత్రక కథతో, భారీ బడ్జెట్, అట్టహాసంతో విడుదలైన హృతిక్ రోషన్ 'మోహెంజోదారో' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా రెండురోజుల్లో రూ. 18.3 కోట్లు మాత్రమే రాబట్టింది. 'రుస్తుం' కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదలైన 'మొహెంజోదారో' తొలిరోజు రూ. 8.8 కోట్లు, రెండోరోజు రూ. 9.5 కోట్లు రాబట్టింది. -
సినిమా బడ్జెట్లతో పోలిస్తే కలెక్షన్లు రివర్స్
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు మొహంజదారో, రుస్తుం బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. శుక్రవారం ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. రుస్తుంను 65 కోట్ల రూపాయల వ్యయంతో తీయగా, మొహంజదారోను 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కాగా తొలిరోజు ఈ రెండు సినిమాల కలెక్షన్లను రుస్తుందే పైచేయి. తొలిరోజు రుస్తుం సినిమాకు భారత్‌లో 14.11 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా మొహంజదారోకు 8.87 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు వెల్లడించాడు. చారిత్రక కథతో తెరకెక్కిన మొహంజొదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన రుస్తుం సినిమాలో అక్షయ్ సరసన ఇలియానా నటించింది. -
'రుస్తుం' నేరస్తుడా కాదా?
టైటిల్ : రుస్తుం జానర్ : క్రైమ్- మిస్టరీ నటీనటులు : అక్షయ్ కుమార్, ఇలియానా డిక్రూజ్, ఈషా గుప్తా, అర్జన్ బజ్వా తదితరులు దర్శకత్వం : టిను సురేష్ దేశాయ్ నిజాయితీ కలిగిన ఓ నౌకాదళ అధికారి, ఒంటరితనాన్ని ఫీలయ్యే అతని అందమైన భార్య, ఆమె ప్రియుడు, ఆ ప్రియుడి సంచలన హత్య.. నాలుగు మాటల్లో చెప్పాలంటే ఇదే 'రుస్తుం' కధ. సృష్టించిన కథ కాదు..1959లో జరిగిన వాస్తవ సంఘటన. నానావటి అనే నావల్ కమాండర్ జీవితంలోని అనూహ్య ఘటన. మీడియాలో సంచలనాత్మకమైన కేసుగా ప్రచారం పొందిన ఘటన. సాధారణంగా సినిమాల్లో అయినా, నిజ జీవితాల్లో అయినా భర్త వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండటం, తెలిసినా భార్య మౌనంగా భరించడం, లేదంటే తప్పు తెలుసుకుని వస్తే భార్య అతన్ని క్షమించటం లాంటివి చూస్తుంటాం. కానీ ఇక్కడ భార్య వివాహేతర సంబంధం, భర్త ముందు ఆ బంధాన్ని ఒప్పుకోవడం, ఆ తర్వాతి పరిస్థితులను తెరపై చూపించారు. నిజాయితీ గల నావల్ కమాండర్ రుస్తుం పావ్రీ(అక్షయ్ కుమార్), సింథియా(ఇలియానా)లు భార్యాభర్తలు. విధి నిర్వహణలో రుస్తుం ఆమెకు దూరంగా ఉన్న క్రమంలో సింథియా.. ధనవంతుడైన పార్శీ యువకుడు, భర్త స్నేహితుడు అయిన విక్రమ్ మఖిజా(అర్జన్ బజ్వా)తో ప్రేమలో పడుతుంది. అదే విషయాన్ని భర్తకు వివరిస్తుంది. విషయం అర్థం చేసుకున్న రుస్తుం.. భార్యను స్నేహితుడి వద్దకే పంపాలని అనుకుంటాడు. భార్యాపిల్లలను సినిమాకు పంపించి, భార్య ప్రియుడు ఉండే చోటుకి వెళ్లి అనూహ్యంగా అతన్ని షూట్ చేస్తాడు. అక్కడి నుంచి నేరుగా అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోతాడు. పైగా స్నేహితుడిని చంపినందుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదంటూ కోర్టుకు విన్నవిస్తాడు. మీడియాలో సంచలనమై కూర్చుంటుంది ఈ హత్య. రుస్తుం నేరస్తుడు కాదంటూ కొందరు, అతను శిక్షార్హుడంటూ మరికొందరు గళాలు విప్పుతారు. రుస్తుం శిక్షించబడ్డాడా.. రక్షించబడ్డాడా.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాల్సిన కథనం. దర్శకుడు పెద్దగా సమయాన్ని వృధా చేయకుండా ప్రేక్షకులను డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిపోయాడు. కోర్టు విచారణ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది. సినిమా మొత్తానికి అక్షయ్ నటన వెన్నెముక లాంటిదని చెప్పొచ్చు.. పాత్రకు హుందాతనం తెచ్చిపెట్టారు. ఇలియానా ఇరగదీసిందనే చెప్పాలి. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశారు. ఇలియానా ప్రియుడిగా కనిపించిన అర్జన్ బజ్వా పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. అన్నను చంపిన వ్యక్తికి శిక్ష పడాలని కోరుకునే పాత్రలో ఈషా గుప్తా నటన ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది. అసలు కథకు కావలసినంత డ్రామాను జోడించాడు దర్శకుడు.కొన్నిచోట్ల కథనం కాస్త సాగినట్టుగా అనిపిస్తుంది. ఓ నిజాయితీ గల ఆఫీసర్ విలువ.. అతని సేవలు, అదే ఆఫీసర్ సరైన పనిని సరైనది కాని పద్ధతిలో చేయడం, కేసుకి సంబంధించి ప్రజా స్పందన, భార్య సంఘర్షణ, చివరికి లభించనున్న తీర్పులాంటివి ప్రేక్షకులను కథలో లీనం చేస్తాయి.. ఆలోచనలో పడేస్తాయి. మొత్తానికి అక్షయ్ అద్వితీయ నటన కోసం 'రుస్తుం' సినిమాను తప్పక చూడాలనేది ధియేటర్ బయట టాక్. -
'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్..
-
'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్..
ఆగస్టు 12 న విడుదల కానున్న అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తారల్లో కూడా ఆ మానియా ఊపందుకుంది. అక్షయ్ రుస్తుం సినిమా విడుదలకు ఆత్రుతతో ఎదురుచూస్తున్న విషయాన్ని యువతార అలియా భట్ కళాత్మకంగా తెలిసింది. అక్షయ్, రవీనాల హిట్ సినిమా 'మొహ్రా'లో కుర్రకారును ఊపేపిన వాన పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌తోపాటు అక్షయ్‌ను కూడా ఫిదా చేసింది ఉడ్తా పంజాబ్ స్టార్. ఆ పాటలో రవీనా కట్టుకున్న పసుపు రంగు చీరనే ధరించి.. అచ్చంగా ఆమెలానే డ్యాన్స్ చేసింది అలియా. తన తల మీద నేవల్ ఆఫీసర్స్ క్యాప్‌ను ధరించి 'రుస్తుం' సినిమాను ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో అక్షయ్ తొలిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ వీడియోను చూసిన అక్షయ్.. ఇక నుంచి నా ప్రతి సినిమాలో ఓ వాన పాట తప్పనిసరి అవుతుంది, సూపర్బ్ అలియా అంటూ ట్వీట్ చేశారు. అలియా అభిమానులైతే ఆ వీడియోను షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. After this act you're sure to get a mandatory rain song in every film -
'రస్తుం'కు రజనీకాంత్ విషెస్
ముంబై: బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రుస్తుం' విజయవంతం కావాలని దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆకాంక్షించారు. రుస్తుం సక్సెస్ కావాలని కోరుకుంటూ అక్షయ్ కుమార్ కు ట్విట్టర్ ద్వారా 'కబాలి' స్టార్ విషెస్ చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు రజనీకాంత్ కు అక్షయ్ కుమార్ ధన్యవాదాలు చెప్పాడు. ఆయన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడినని పేర్కొన్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన 'రుస్తుం' శుక్రవారం విడుదల కానుంది. 1959లో నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నేవీ ఆఫీసర్ రుస్తుం పవ్రీగా నటిస్తున్నాడు. అతడి సరసన ఇలియానా హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ అగ్రతారలు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, సోనమ్ కపూర్ కూడా 'రుస్తుం' విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కాగా, రజనీకాంత్ రోబో సీక్వెల్ '2.0'లో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. Dear @akshaykumar ... I wish you all success for your forthcoming release #Rustom — Rajinikanth (@superstarrajini) 10 August 2016 Thank you so much Rajni sir. Would love for you to see it. https://t.co/9iEIT1cKFn — Akshay Kumar (@akshaykumar) 10 August 2016 -
'ఆమె వివాహేతర సంబంధమే అసలు విషయం'
తన తదుపరి చిత్రం 'రుస్తుం' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అక్షయ్ కుమార్. క్రైమ్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ తొలిసారి నేవల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో భార్య ప్రియుడిని చంపే వ్యక్తిగా అక్షయ్ నటిస్తున్నారు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. సాధారణంగా హిందీ సినిమాల్లో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటాడు, చివరికి తన తప్పు తెలుసుకున్నాక భార్య అతడిని క్షమిస్తుంది, అంగీకరిస్తుంది. తిరిగి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. కానీ ఈ కథలో అలా కాదు. భార్యే వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటుంది, భర్త క్షమాపణలు కోరుతుంది.. ఆ భర్త క్షమించాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిన కథ అన్నారు. భార్య వివాహేతర సంబంధమే కథకు కీలకమైన పాయింట్ అని తెలిపారు. ఈ సినిమాలో అక్షయ్ భార్యగా ఇలియానా నటిస్తున్నారు. తొలిసారి ఇంత వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నందుకు ఈ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న అక్షయ్.. పాత్రకు సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెబుతున్నారు. ప్రత్యేకించి నౌకాదళ ఆఫీసర్లను కలవడంగానీ, పుస్తకాలను చదవడంలాంటివేమీ చేయలేదట. ఓ అధికారి మాత్రం సెల్యూట్ ఎలా చేయాలి, బ్యాడ్జెస్ ఎలా ధరించాలి అనే విషయాల్లో ఆయన్ను గైడ్ చేసినట్లు తెలిపారు. ఆ యూనిఫామ్ వేస్కున్న తరువాత మాత్రం తెలీకుండానే బాధ్యతగా ఫీలయ్యానని, అధికార దర్పం తెలిసిందని అంటున్నారు. ఆ యూనిఫామ్ ధరించేవారిని చూస్తుంటే తనకిప్పుడు అసూయగా ఉందని చెప్పారు ఎయిర్ లిఫ్ట్ స్టార్ అక్షయ్ కుమార్. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన రుస్తుం ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఇలియానా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. -
కెమెరా ముందు హీరోయిన్ చిందులు!
'గోపికమ్మ చాలును లేమ్మా' అంటూ తెలుగువారిని మురిపించిన పూజాహెగ్డే గుర్తుంది కదా! తెలుగులో వరుణ్ తేజతో 'ముకుంద', నాగాచైతన్యతో 'ఒక లైలా కోసం' సినిమాలు తీసిన ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మొహెంజోదారో' సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడీగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. వచ్చే శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాపై పూజ చాలా ఆశలు పెట్టుకున్నది. హృతిక్ 'మొహెంజోదారో'- అక్షయ్‌కుమార్ 'రుస్తుం' సినిమాలు ఒకేసారి వస్తుండటం ఈ బాక్సాఫీసు క్లాష్‌పై చాలా ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలూ ఒకేసారి తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. హృతిక్, అక్షయ్ మాత్రం తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. తమ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించాలని పరస్పరం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా ప్రమోషన్ కోసం పూజాహెగ్డే ఒకింత చిత్రమైన స్టెప్ వేసింది. హృతిక్ తొలి సినిమా 'కహో నా ప్యార్ హై' సినిమాలోని టైటిల్ పాటకు డ్యాన్స్ చేస్తూ డబ్స్మాష్ వీడియోను పోస్టు చేసింది. మరో మూడురోజుల్లో విడుదలవుతున్న తన తొలి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టింది. -
సీనియర్ హీరో సినిమాకు జూనియర్ ఝలక్!
ఈ నెల 12న బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్‌కు తెరలేవబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అక్షయ్‌కుమార్ 'రుస్తుం', హృతిక్ రోషన్ 'మొహెంజోదారో' సినిమాలు ఒకేసారి 12న విడుదలకాబోతున్నాయి. ఇండిపెండెన్స్ డే రేసులో సత్తా చాటేందుకు ఈ రెండు సినిమాలు పోటీపడుతుండటంతో సహజంగా బాలీవుడ్ దృష్టి ఈ బిగ్ సినిమాలపైనే ఉంది. అక్షయ్, ఇలియాన, ఈషా గుప్తా జంటగా తెరకెక్కిన 'రుస్తుం' సినిమా.. 'మొహెంజోదారో'తో పోలిస్తే చిన్న సినిమా అనే చెప్పాలి. 'రుస్తుం' రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. అంతకు రెట్టింపు బడ్జెట్‌తో ప్రాచీన సింధు నాగరికత నేపథ్యంతో హృతిక్ రోషన్, పుజా హెగ్డేల 'మొహెంజోదారో' వస్తున్నది. కానీ, బాక్సాఫీస్ పరంగా చూస్తే సీనియర్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ మంచి కథ-తక్కువ బడ్జెట్ కాంబినేషన్‌తో భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఎయిర్‌లిఫ్ట్, బేబీలాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇక రెండేళ్ల కిందట వచ్చిన 'బ్యాంగ్ బ్యాంగ్' తర్వాత హృతిక్ వెండితెరపై కనిపించలేదు. కాబట్టి హృతిక్ ఇది కామ్బ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సహజంగానే హృతిక్ 'మొహెంజోదారో' సినిమా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ అండగా ఉండటంతో దాదాపు 2,300 నుంచి 2,500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఇక అక్షయ్ సినిమా దాదాపు రెండువేల థియేటర్లకే పరిమితం కానుంది. బాలీవుడ్లో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్ల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో షారుఖ్‌ఖాన్ 'దిల్వాలే', రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనే 'బాజీరావు మస్తానీ' ఒకేరోజు విడుదలయ్యాయి. అయితే, 'బాజీరావు' ఆడినంతగా 'దిల్వాలే' ఆకట్టుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', షారుఖ్ 'రాయిస్' ఒకేరోజున వస్తాయని భావించినప్పటికీ ఈ రేసు నుంచి షారుఖ్ తప్పుకోగా.. 'సుల్తాన్' తన దూకుడు చాటిన సంగతి తెలిసిందే. -
గోవా బ్యూటి వేదాంతం
అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న గోవా బ్యూటి ఇలియానా.. లైమ్ లైట్లో ఉండేందుకు సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. ఇప్పటికే హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న ఈ బ్యూటి తాజాగా వేదాంతం చెపుతోంది. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న రుస్తుం సినిమా మీద ఆశలు పెట్టుకున్న ఇలియానా.. సినిమా ప్రమోషన్‌తో పాటు తన వ్యక్తిగత ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటోంది. ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇలియానా తను ప్రేమ విఫలమైతే.. ఆ వ్యక్తితో ఇంకెప్పటికీ మాట్లాడనని చెప్పింది. అంతేకాదు.. 'నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. ఎక్కడో.. ఉన్న అదృష్య శక్తి మనల్ని నడిపిస్తోంది అంటే, నమ్మడం నాకు నచ్చదు.. అయితే అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే' అంటూ తేల్చేసింది. -
దేశభక్తుడా.. విద్రోహా.. హంతకుడా..?
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా రుస్తుం. 1959లో నేవీలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నేవీ ఆఫీసర్ రుస్తుం పవ్రీగా నటిస్తున్నాడు. అక్షయ్ సరసన ఇలియానా హీరోయిన్గా నటిస్తోంది. 1959 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు దర్శకుడు టిను సురేష్ దేశాయ్. జీ టివి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న రుస్తుం థియట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నావల్ ఆఫీసర్ లుక్‌లో డాషింగ్‌గా కనిపిస్తున్న అక్షయ్ ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకున్నాడు. ఇక టీజర్లో రుస్తుం దేశభక్తుడా..? విద్రోహా..? హంతకుడా..? అంటూ సంధించిన ప్రశ్నలు సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్షయ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2 సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. -
ఆ విషయాన్ని మాత్రం భరించలేను...
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన సొగసరి ఇలియానా. హీరోయిన్ గా వెండితెరపై నాజూకుగా కనిపించేందుకు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. బర్ఫీ, హ్యాపీ ఎండింగ్, మై తేరా హీరో, మరికొన్ని బాలీవుడ్ మూవీలలో నటించి హిందీ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన రుస్తుమ్ లో నటిస్తుంది. జీరో సైజ్ అంటూ హీరోయిన్లు చాలా మంది గతంలో బాడీని ఆ ఆకృతిలో మార్చుకునేందుకు తంటాలు పడ్డారు. అందుకు కారణం ఇల్లీ బేబీనే అని కూడా భావించవచ్చు. ఎందుకంటే నాజూకు నడుముతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది ఈ గోవా సుందరి. ఒకానొక సమయంలో తాను కాస్త లావుగా ఉండేదాన్నని, చాలా రోజులు బాడీ సమస్యను ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇప్పటికీ చాలా లావుగా ఉన్నాట్లే భావిస్తానని, ఎందుకుంటే తాను అందరిలా కాదని అభిప్రాయపడింది. కాస్త బరువు పెరిగినా, ఓ మై గాడ్.. నేను ఇంత లావుగా ఉన్నానా? అని ఆందోళన చెందుతానని చెప్పుకొచ్చింది. ఓ ఫొటోను తన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన బరువు, నడుము గురించి కొన్ని విషయాలు చెప్పింది. ఒకవేళ తాను బయటికి వెళ్లినప్పుడు అద్దంలో చూసుకుంటే సాధారణ అమ్మాయి లాగ కనిపిస్తే చాలు, తన అందంపై ఎన్నో కామెంట్లు వస్తాయంటోంది. అయినా కూడా తాను ఎందుకు ఫొటోలలో చాలా స్పెషల్ గా కనిపించాలి, అంత అవసరం లేదని మనసుకు సమాధానం చెప్పుకుంటానంది. మోడల్స్ శరీరాకృతి వేరు హీరోయిన్ల స్టైల్ వేరని, ఎవరికి నచ్చిన తరహాలో వారు ఉండాలనుకుంటారని చెప్పింది. -
అక్షయ్ వర్సెస్ హృతిక్!
ముంబయి: బాలీవుడ్ బాక్సాపీసు వద్ద ప్రముఖ హీరోలు హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్ తలపడనున్నారు. రుస్తుం సినిమాతో అక్షయ్ వస్తుండగా అదే సమయంలో అదే తేదీన మొహంజదారో చిత్రంతో హృతిక్ వస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను కూడా ఆగస్టు 12కే విడుదల చేయాలని రెండు చిత్రాల నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రుస్తుం సినిమా విడుదల తేదినీ తాము ముందే ప్రకటించినందున తమకోసం మొహంజదారో చిత్ర విడుదల తేదిని మార్చాల్సిందిగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ అశుతోష్ గౌరీకర్ ప్రొడక్షన్స్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, తమ చిత్ర దర్శకుడిని ఎవరూ కలవలేదని, అయినా, తమ చిత్ర విడుదల తేదిని జనవరి 15, 2015లోనే ఆగస్టు 12గా ప్రకటించామని అశుతోష్ గౌరీకర్ ప్రొడక్షన్స్ అధికార ప్రతినిధి చెప్ఆపరు. తమ చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు. -
గలగల పారుతున్న గోదారిలా...!
అందమైన అమ్మా యిని చూడగానే ఏ అబ్బాయి మనసైనా గాల్లో తేలినట్టు.. గుండె పేలినట్టు అయిపోవాలి. అచ్చంగా ‘జల్సా’లో ఇలియానాను చూసి, ‘గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే..’ అని పవన్ కల్యాణ్ పాడినట్టన్న మాట. యస్.. ఇలియానాను చూస్తే.. ఏ అబ్బాయి అయినా అలానే అయిపోతాడు. జర జర పాకే విషంలా ఫాస్ట్‌గా ఇలియానాపై ప్రేమ మొదలైపోతుంది. అందానికి చిరునామా అనలేం కానీ, సమ్‌థింగ్ వెరైటీ ఫిజిక్‌తో ఆకట్టుకుంటారు ఇలియానా. ‘దేవదాసు’ ద్వారా ఇలియానా పరిచయమైనప్పుడు ‘మరీ సన్నగా ఉంది’ అనే కామెంట్స్ వినిపించాయి. తర్వాత తర్వాత ‘అలా ఉన్నా బాగానే ఉంది’ అనిపించుకో గలిగారు ఇలియానా. మొదటి సినిమాయే సూపర్ హిట్ కావడం, ఆ వెంటనే మహేశ్‌బాబు వంటి స్టార్ హీరోతో ‘పోకిరి’ చేసే అవకాశం రావడం, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇలియానాకు తిరుగులేకుండా పోయింది. ఇలియానా అంటే గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్.. అలాంటి పాత్రలే చేయగలుగుతారని ఫిక్స్ అవుతున్న తరుణంలో ‘రాఖీ’తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్నారు ఈ గోవా బ్యూటీ. వెనక్కి తిరిగి చూసుకునేంత తీరిక లేకుండా దాదాపు ఏడేళ్లు ఫుల్ బిజీగా సినిమాలు చేశారామె. సడన్‌గా డౌన్‌ఫాల్ మొదలైంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న ఇలియానాకు విచిత్రంగా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. కానీ, ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆ మలుపే బాలీవుడ్. ‘బర్ఫి’ చిత్రం ద్వారా ఇలియానా హిందీ తెరకు పరిచయం అయ్యారు. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘దేవదాసు’ ఎంతటి గుర్తింపు తెచ్చిందో.. హిందీలో చేసిన మొదటి సినిమా ‘బర్ఫి’ కూడా అంతే గుర్తింపు తెచ్చింది. దాంతో బాలీవుడ్ దర్శక- నిర్మాతల దృష్టి ఇలియానాపై పడింది. ‘ఫటా పోస్టర్... నిఖ్లా హీరో’, ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’... ఇలా వరుసగా హిందీ చిత్రాలు చేశారు. సో.. తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ హిందీలో ఇలియానా అవకాశాలు దక్కించుకో గలిగారు. అయితే ఈ మధ్య హిందీలో కూడా గ్యాప్ వచ్చింది. దానికి కారణం ఇలియానానే. ఏ పాత్ర పడితే అది చేయకూడదని ఫిక్స్ అయిపోయా రట. అందుకే కొంత విరామం తీసుకున్నారు. ఇటీవలే ‘రుస్తుమ్’ అనే చిత్రం అంగీకరించారు. ఇందులో ఈ బక్కపలచని భామది బరువైన పాత్ర అట. అందుకే గ్రీన్ సిగ్న్ ఇచ్చేశారు. ఇలియానా కథా నాయిక అయ్యి పదేళ్లయ్యింది. స్టిల్ నాట్ అవుట్. ‘పోకిరి’ సినిమాలో ‘గల గల పారు తున్న గోదారిలా..’ ఇలియానా కెరీర్ కొనసాగుతోంది. -
'హ్యాపి ఎండింగ్‌తో ముగిసిపోలేదు'
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా, కొద్దిరోజులు అవకాశాల్లేక ఖాళీగా ఉంటుంది. చివరగా సైఫ్ అలీఖాన్ హీరోగా తెరకెక్కిన హ్యాపి ఎండింగ్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ తరువాత అవకాశాల్లేక మోడల్‌గా సరిపెట్టుకుంటుంది. అదే సమయంలో సౌత్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సౌత్‌లో హీరోయిన్గా సమయంలోనే బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీని తరువాత తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోవటం మానేశారు. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కెరీర్ ఆశాజనకంగానే కనిపించినా తరువాత మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రుస్తుం సినిమాలో లీడ్ రోల్లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇల్లి బేబి. హ్యాపి ఎండింగ్ సినిమాతో తన కెరీర్ ముగిసి పోలేదన్న ఇలియానా త్వరలోనే 'రుస్తుం'తో మీ ముందుకు వస్తున్నా అంటూ కామెంట్ చేసింది. మరి ఈ సినిమాతో అయినా ఇలియానా కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి. -
పుకార్లపై ఘాటుగా స్పందించిన హీరోయిన్
ముంబై: తాను సినిమాల నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని గోవా సుందరి ఇలియానా స్పష్టంచేసింది. టాలీవుడ్ కు ఆమె కొద్దికాలం నుంచి దూరంగా ఉంది. చివరగా బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ సరసన 'హ్యాపీ ఎండింగ్' మూవీలో నటించింది. ఆ తర్వాత ఏ మూవీలోనూ కనిపించకపోవడంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని వదంతులు వినిపించాయి. ఈ నేపథ్యంలో 'హ్యాపీ ఎండింగ్' తన అసలు ఎండింగ్ కాదని ప్రస్తుతం 'రుస్తుమ్' మూవీలో నటిస్తున్నట్లు చెప్పింది. ఆ మూవీతోనే తన కెరీర్ ఆగిపోలేదని, రుస్తుమ్ ఈ ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిసిందే. తాను చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తానని, బ్రాండ్ అంటూ ఏ దుస్తులు పడితే అవి వేసుకోనని చెప్పింది. ఫ్యాషన్ గురించి మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ఓల్డ్ ఫ్యాషన్ ఫాలో అయ్యే వారంటే తనకు ఇష్టమని, ఫర్హాన్ అక్తర్ ఇందుకు తగినవాడని అభిప్రాయాన్ని వెల్లడించింది. హీరోయిన్స్ లో మాత్రం సోనమ్ కపూర్ ఫ్యాషన్ బాగా ఫాలో అవుతుందని, ఆమె దాంట్లో తాను కనీసం సగం పనులు కూడా చేయలేనని అంటోంది. ర్యాంప్ వాక్ చేస్తుంటే తాను ఎక్సైజ్ మెంట్ కు గురికానని.. నడుస్తుంటే కింద పడిపోకూడదని ప్రార్థిస్తుంటానని ఇలియానా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ, తనపై వస్తున్న వదంతులపై మీడియాతో ముచ్చటించింది.