బాలీవుడ్ సినిమాలకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అది 'రుస్తుం' సినిమాతో మరోసారి బయటపడింది. 1959నాటి నావికాదళం అధికారి నానావతి కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వాస్తవిక ఘటనలకు చాలావరకు సినీ నాటకీయత జోడించడమే కాకుండా.. నేవీ యూనిఫామ్ విషయంలోనూ పెద్ద తప్పులే చేశారు.
నిజ జీవిత సంఘటనలకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం కల్పిత కథ మాత్రమేనని సినిమా మొదలయ్యేటప్పుడు దర్శకనిర్మాతలు చెప్పుకొన్నా.. నేవీ యూనిఫామ్ విషయంలో మాత్రం తెలిసీతెలియని తప్పులు చాలా చేశారు. అసలు ఏమాత్రం అధ్యయనం చేయకుండా ఇష్టానుసారం ఈ సినిమాలో హీరో ధరించిన నేవీ డ్రెస్‌ను రూపొందించినట్టు కనిపిస్తోంది. సినిమాలో లీడ్ క్యారెక్టర్‌గా ఉన్న హీరో అక్షయ్ కుమార్ అస్తవ్యస్తంగా రూపొందించిన ఈ నేవీ డ్రెస్ వేసుకొని సినిమా తెరనిండా కనిపించడం పలువురు రక్షణరంగ నిపుణులను విస్మయపరిచింది.
ఈ సినిమా కథ 1959నాటికి చెందింది. అయినా చిత్ర హీరో సీడీఆర్ రుస్తుం పవ్రీ ధరించిన నేవీ యూనిఫామ్‌పై అడ్డగోలుగా మెడల్స్ పెట్టేశారు. నేవీ యూనిఫామ్ భుజాల మీద ఉండే నెల్సన్ రింగ్‌ను తలకిందులుగా పెట్టారు. ఇక యూనిఫామ్ మీద పెట్టిన చాలా మెడల్స్ ఇటీవలకాలానికి చెందినవి. 1972 తర్వాత ప్రవేశపెట్టిన పలు మెడల్స్ తోపాటు 1999 కార్గిల్ యుద్ధం, 2001-02లో ప్రవేశపెట్టిన ఓపీ పరాక్రమ్ మెడల్ కూడా ఈ యూనిఫామ్ ఉండటం గమనార్హం.
ఇక గడ్డం లేకుండా కేవలం మీసాన్ని కలిగి ఉండటం 1971 తర్వాతనే నేవీలో అనుమతించారు. నేవీ యూనిఫామ్, హీరో రూపరేఖల విషయంలో ఇలాంటి తప్పులు చాలా చేశారు. ఈ తప్పులను గుర్తిస్తూ ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సందీప్ ఉన్నిథాన్ పెట్టిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. నిజానికి బాలీవుడ్‌లో ఆర్మీ యూనిఫామ్ విషయంలో తప్పులు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో వచ్చిన చాలా సినిమాల్లోనూ ఇదే తరహా పొరపాట్లు చాలాచేశారు దర్శకనిర్మాతలు.
హీరో డ్రెస్ విషయంలో ఇన్ని తప్పులా?
Published Wed, Aug 17 2016 10:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
Advertisement
Advertisement