'రుస్తుం' నేరస్తుడా కాదా?
టైటిల్ : రుస్తుం
జానర్ : క్రైమ్- మిస్టరీ
నటీనటులు : అక్షయ్ కుమార్, ఇలియానా డిక్రూజ్, ఈషా గుప్తా, అర్జన్ బజ్వా తదితరులు
దర్శకత్వం : టిను సురేష్ దేశాయ్
నిజాయితీ కలిగిన ఓ నౌకాదళ అధికారి, ఒంటరితనాన్ని ఫీలయ్యే అతని అందమైన భార్య, ఆమె ప్రియుడు, ఆ ప్రియుడి సంచలన హత్య.. నాలుగు మాటల్లో చెప్పాలంటే ఇదే 'రుస్తుం' కధ. సృష్టించిన కథ కాదు..1959లో జరిగిన వాస్తవ సంఘటన. నానావటి అనే నావల్ కమాండర్ జీవితంలోని అనూహ్య ఘటన. మీడియాలో సంచలనాత్మకమైన కేసుగా ప్రచారం పొందిన ఘటన.
సాధారణంగా సినిమాల్లో అయినా, నిజ జీవితాల్లో అయినా భర్త వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండటం, తెలిసినా భార్య మౌనంగా భరించడం, లేదంటే తప్పు తెలుసుకుని వస్తే భార్య అతన్ని క్షమించటం లాంటివి చూస్తుంటాం. కానీ ఇక్కడ భార్య వివాహేతర సంబంధం, భర్త ముందు ఆ బంధాన్ని ఒప్పుకోవడం, ఆ తర్వాతి పరిస్థితులను తెరపై చూపించారు.
నిజాయితీ గల నావల్ కమాండర్ రుస్తుం పావ్రీ(అక్షయ్ కుమార్), సింథియా(ఇలియానా)లు భార్యాభర్తలు. విధి నిర్వహణలో రుస్తుం ఆమెకు దూరంగా ఉన్న క్రమంలో సింథియా.. ధనవంతుడైన పార్శీ యువకుడు, భర్త స్నేహితుడు అయిన విక్రమ్ మఖిజా(అర్జన్ బజ్వా)తో ప్రేమలో పడుతుంది. అదే విషయాన్ని భర్తకు వివరిస్తుంది. విషయం అర్థం చేసుకున్న రుస్తుం.. భార్యను స్నేహితుడి వద్దకే పంపాలని అనుకుంటాడు. భార్యాపిల్లలను సినిమాకు పంపించి, భార్య ప్రియుడు ఉండే చోటుకి వెళ్లి అనూహ్యంగా అతన్ని షూట్ చేస్తాడు. అక్కడి నుంచి నేరుగా అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోతాడు. పైగా స్నేహితుడిని చంపినందుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదంటూ కోర్టుకు విన్నవిస్తాడు. మీడియాలో సంచలనమై కూర్చుంటుంది ఈ హత్య. రుస్తుం నేరస్తుడు కాదంటూ కొందరు, అతను శిక్షార్హుడంటూ మరికొందరు గళాలు విప్పుతారు. రుస్తుం శిక్షించబడ్డాడా.. రక్షించబడ్డాడా.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాల్సిన కథనం.
దర్శకుడు పెద్దగా సమయాన్ని వృధా చేయకుండా ప్రేక్షకులను డైరెక్ట్గా కథలోకి తీసుకెళ్లిపోయాడు. కోర్టు విచారణ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది. సినిమా మొత్తానికి అక్షయ్ నటన వెన్నెముక లాంటిదని చెప్పొచ్చు.. పాత్రకు హుందాతనం తెచ్చిపెట్టారు. ఇలియానా ఇరగదీసిందనే చెప్పాలి. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశారు. ఇలియానా ప్రియుడిగా కనిపించిన అర్జన్ బజ్వా పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. అన్నను చంపిన వ్యక్తికి శిక్ష పడాలని కోరుకునే పాత్రలో ఈషా గుప్తా నటన ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది.
అసలు కథకు కావలసినంత డ్రామాను జోడించాడు దర్శకుడు.కొన్నిచోట్ల కథనం కాస్త సాగినట్టుగా అనిపిస్తుంది. ఓ నిజాయితీ గల ఆఫీసర్ విలువ.. అతని సేవలు, అదే ఆఫీసర్ సరైన పనిని సరైనది కాని పద్ధతిలో చేయడం, కేసుకి సంబంధించి ప్రజా స్పందన, భార్య సంఘర్షణ, చివరికి లభించనున్న తీర్పులాంటివి ప్రేక్షకులను కథలో లీనం చేస్తాయి.. ఆలోచనలో పడేస్తాయి. మొత్తానికి అక్షయ్ అద్వితీయ నటన కోసం 'రుస్తుం' సినిమాను తప్పక చూడాలనేది ధియేటర్ బయట టాక్.