సింధు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయ్!
రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది పీవీ సింధు. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ గా మారిపోయింది. ఆమెకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా మారుమోగనున్నాయి. కానీ ఆమె అందరిలాంటి సిటీ అమ్మాయే. బాలీవుడ్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం. అలాగే ఐస్ క్రీమ్ అన్నా, హైదరాబాదీ బిర్యానీ అన్నా మక్కువ. అందుకే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం సినిమాలు, బిర్యానీ ఎదురుచూస్తున్నాయి.
'రుస్తుం', 'మహెంజోదారో' వంటి కొత్త హిందీ సినిమాల గురించి సింధు నన్ను చాలాసార్లు అడిగింది. తను ఇక్కడి వచ్చాక ఐస్ క్రీమ్, బిర్యానీ తినాలనుకుంటోంది' అని సింధు తండ్రి పీవీ రమణ 'ఇండియా టుడే'కు తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో బయట వండిన ఆహారం సింధు తినకుండా తాము చర్యలు తీసుకున్నామని, ఆమె కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన వివరించారు.