సింధుకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు 22వ తేదీన నగరానికి రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహిదిపట్నం, టౌలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు. సింధు వచ్చే ఈ మార్గాల్లో ఎక్కడెక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి అలంకరణలు చేపట్టాలనే ప్రాంతాలను ఎంపిక చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు.
అనంతరం స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం పి.వి. సింధు పై మార్గంలో గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీగా చేరుకుంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద పాఠశాలల విద్యార్థులు, నగర పౌరులు సింధుకు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నగర పౌరులు, క్రీడాకారుల సమక్షంలో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు.
ఈ స్టేడియంలో జరిగే సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. కాగా, సింధు ప్రయాణించే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.