సింధూకు స్వాగతం పలుకుతూ శంషాబాద్ విమానాశ్రయం వద్ద హోర్డింగ్
నేడే సింధు రాక
అపూర్వ స్వాగతానికి ఏర్పాట్లు
భరతమాత నుదుటిన పతక సింధూరం దిద్దిన తెలుగు తేజం వచ్చేస్తోంది. కోట్లాది మంది భారతీయుల కనులలో వెండి వెలుగు నింపిన మన ముద్దుబిడ్డ మరికొద్ది సేపట్లో తెలుగు గడ్డపై అడుగుపెడుతోంది. రియోలో మువ్వన్నెలు రెపరెపలాడించిన బంగారు తల్లికి ఘన స్వాగతం పలికేందుకు భాగ్యనగరం ముస్తాబయింది. ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ... అడుగడుగునా అభిమానుల జయజయధ్వానాలు... గచ్చిబౌలిలో ప్రభుత్వం చేసే ఘన సన్మానం... ఇలా సోమవారమంతా బిజీబిజీగా గడపబోతోంది.
సాక్షి, హైదరాబాద్: రియో వేదికపై భారత కీర్తి పతాకను ఎగురవేసిన తెలుగు తేజం పీవీ సింధు రాక కోసం రాష్ట్రం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది! ఉభాగ్యనగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు సిటీజనులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో రజత పతకంతో సొంత గడ్డపై అడుగుపెట్టనున్న సింధు కు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్రప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు దిగనున్న సింధుకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు.
అక్కడ్నుంచి ఆమె భారీ ర్యాలీ మధ్య గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు. ప్రధాన ఊరేగింపు జరిగే రూట్‌ను జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ట్రాఫిక్, పోలీసు విభాగాలు పరిశీలించాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ హోర్డింగ్‌లతోపాటు గగన్‌పహాడ్, వ్యవసాయ వర్సిటీ ప్రధాన ద్వారం, ఆరాంఘర్ చౌరస్తా, శివరాంపల్లి, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్ చౌరస్తాలలో స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. ఆమెపై పూల వర్షం కురిపించడంతోపాటు వేదికల పైనుంచి ప్రముఖుల ప్రసంగాలతో సింధుకు అపూర్వ స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఘన సన్మానం
సింధును ఘనంగా సన్మానించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సత్కార సభ ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, క్రీడలు, శాప్, సైబరాబాద్ పోలీసు అధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఓపెన్‌టాప్ వాహనంలో ర్యాలీ సాగుతుందన్నారు.
మార్గం మధ్యలో పదిహేను చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో జరిగే సింధు సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నాయిని, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు పాల్గొంటారు. విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు సుమారు 20 నుంచి 30 వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేసినట్లు కమిషనర్ వివరించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ నవీన్‌చంద్ తెలిపారు.